Wednesday, January 22, 2025

ముగిసిన కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం

- Advertisement -
- Advertisement -

64 మంది ఎమ్మెల్యేల హాజరు
40 నిమిషాల పాటు సాగిన సమావేశం
సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రేవంత్‌రెడ్డి
బలపరిచిన 10 మంది ఎమ్మెల్యేలు
ఢిల్లీలోని సోనియా నివాసంలో
కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీ ఇన్‌చార్జీ మాణిక్‌రావు ఠాక్రే నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. గెలిచిన ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన ఏఐసిసి పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆ పార్టీ శాసనసభా పక్షం సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చింది. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగించాలని ఈ సమావేశంలో తీర్మానించినట్లు కర్ణాటక పిసిసి చీఫ్, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తెలిపారు.

ఈ మేరకు సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భేటీ ముగియడంతో అధిష్టానంతో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది గవర్నర్‌కు తెలియజేయనున్నారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత ఎంపికపై చర్చించినట్లు కర్ణాటక పిసిసి చీఫ్, డిప్యూటీ సిఎం డికె శివకుమార్ తెలిపారు. ఎంపిక బాధ్యతను ఏఐసిసి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి తీర్మానం పెట్టగా ఎమ్మెల్యేలు దానిని బలపరిచారని ఆయన వెల్లడించారు. అనంతరం సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు అధిష్టానానికే అప్పగించారన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని ఎమ్మెల్యేలు తీర్మానించినట్లు శివకుమార్ పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని అధిష్టానానికి పంపినట్లు పరిశీలకుడు డికె శివకుమార్ వెల్లడించారు.

ఆదివారం రాత్రి అందరూ హైదరాబాద్‌కు రాకపోవడంతో…
అయితే పిసిసి అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి పేరును ముఖ్యమంత్రిగా ఖరారు చేసినట్లుగా తెలిసింది. రెండు రోజులుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు దీపాదాస్ మున్షీ, ఇన్‌చార్జీ మాణిక్‌రావు ఠాక్రేలు హైదరాబాద్‌లో మకాం వేశారు. ఆదివారం రాత్రే ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్ చోరుకోవడానికి సమయం పట్టడంతో భేటీని వాయిదా వేసి సోమవారం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సమావేశమయ్యారు.

సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతకు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు
సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. 40 నిమిషాల పాటు సాగిన సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానాన్ని పరిశీలకులు ఢిల్లీకి పంపించారు. అయితే, రేవంత్‌రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పదిమంది ఎమ్మెల్యేలు బలపరిచారు. అనంతరం ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ ముగిసింది. ఈ సీఎల్పీ భేటీకి ఏఐసిసి పరిశీలకులు డికె శివకుమార్‌తో పాటు దీప్‌దాస్ మున్షీ, జార్జ్, అజయ్, మురళీధరన్‌లు పాల్గొన్నారు.

ఢిల్లీలోని సోనియా నివాసంలో సమావేశం
ఈనేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో సిఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించిన తరువాతే కాంగ్రెస్ పార్టీ రాజ్‌భవన్‌కు సిఎం అభ్యర్థిపై సమాచారం ఇవ్వనుంది. అయితే ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొనడానికి డికె శివకుమార్, దీప్‌దాస్ మున్షీ,ఇన్‌చార్జీ మాణిక్‌రావు ఠాక్రేలను ఢిల్లీకి రావాలని అధిష్టానం సూచించడంతో వారంతా ఢిల్లీకి వెళ్లారు. ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అయితే అధిష్టానం నుంచి నిర్ణయం రాగానే సిఎం అభ్యర్థి రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం ఇప్పటికే గవర్నర్ తమిళి సైతో సమావేశమైన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. మరోవైపు ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే రాజ్‌భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారు 175 మంది ఆసీనులయ్యే విధంగా ప్రజా దర్భార్ హాల్‌లో ఏర్పాటు చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని రాజ్‌భవన్ సెక్రటేరియట్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ (జీఏడి) ప్రొటోకాల్ విభాగానికి చేరవేసింది. దీంతోపాటు రాజ్‌భవన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తును కూడా పెంచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News