Wednesday, January 22, 2025

ఎంఎస్‌ఎంఇలను ప్రభుత్వం నాశనం చేసింది

- Advertisement -
- Advertisement -

అలీగఢ్ మినహాయింపు ఏమీ కాదు
ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఆరోపణలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్‌ఎంఇలను ప్రభుత్వం‘నాశనం చేసింది’ అని కాంగ్రెస్ ఆరోపించింది. అలీగఢ్‌లో నూరు సంవత్సరాలుగా సాగుతున్న తాళాల పరిశ్రమ మోడీ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఇబ్బంది పడుతోందని పార్టీ ప్రశ్నించింది. అలీగఢ్‌లో ప్రధాని ర్యాలీకి ముందే ఆయనకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ప్రశ్నలు సంధించారు. హత్రాస్ బాధితురాలికి న్యాయం చేయడంలో బిజెపి ఎందుకు విఫలమైంది అని రమేష్ ప్రశ్నించారు.

‘జుమ్లా వివరాల’పై తన వ్యాఖ్యల గురించి వివరించిన రమేష్ అలీగఢ్‌లోని దశాబ్దాల చరిత్ర కలిగిన తాళాల పరిశ్రమ మోడీ ప్రభుత్వ హయాంలో ఇక్కట్లు ఎదుర్కొంటున్నదని ఆరోపించారు. ‘ఈ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఇలను నాశనం చేసింది. అలీగఢ్ ఏమీ మినహాయింపు కాదు. ప్రధాని మోడీ 2014లో ప్రచారం చేసినప్పుడు చిన్న వ్యాపార సంస్థలపైనే తన ప్రసంగంలో దృష్టి కేంద్రీకరించారు. అయినా పది సంవత్సరాల తరువాత తాళాల తయారీదారులు సరసమైన ధరలకు ముడి సరకులను కొనుగోలు చేసేందుకు అలీగఢ్‌లో ఇప్పటికీ ప్రభుత్వ డిపో లేదు’ అని రమేష్ తెలిపారు. ‘ఖరీదైన, ఆధారపడదగని విద్యుత్ సరఫరా కూడా ఒక ప్రధాన సమస్య. దీనితో తయారీలో తరచు జాప్యం జరుగుతోంది.

ఇది తాళాల తయారీ వ్యయాన్ని గణనీయంగా పెంచుతోంది’ అని రమేష్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ జిఎస్‌టి వ్యవస్థకు తాళాల తయారీదారులు అలవాటు పడలేకపోతున్నారని, చైనా సంస్థలతో పోటీ పడడంలో ప్రభుత్వం నుంచి వారికి మద్దతు లభించడం లేదని ఆయన ఆరోపించారు. ‘ఒకప్పుడు ఎంతగానో వర్ధిల్లిన ఈ పరిశ్రమను బిజెపి ఎందుకు అలక్షం చేసింది? తన ప్రభుత్వం నాసిరకం జిఎస్‌టి అమలు వల్ల దారుణంగా దెబ్బ తిన్న ఎంఎస్‌ఎంఇల పునరుత్థానానిని ప్రధాని మోడీ వ్యూహం ఏమిటి’ అని రమేష్ అడిగారు. హత్రాస్‌లో 19 సంవత్సరాల దళిత బాలికపై 2020 సెప్టెంబర్ నాటి హత్యాచారం కేసులో నిందితులైన నలుగురిలో ముగ్గురిని హత్రాస్ జిల్లాలో ఒక ప్రత్యేక న్యాయస్థానం 2023 మార్చి 2న నిర్దోషులుగా విడుదల చేసిందని ఆయన తెలిపారు.

‘ప్రధాన నిందితుని అత్యాచారం లేదా హత్యతో సంబంధంలేని అభియోగాల కింద దోషిగా నిర్ధారించారు. తక్కిన ముగ్గురూ స్వేచ్ఛగా బయటకు వెళ్లారు. నేరం తరువాత 11 రోజులకు జరిగిన ఫోరెన్సిక్ పరీక్షతో సహా లోపభూయిష్ట పోలీసుల దర్యాప్తే ఇందుకు ప్రధాన కారణం. బిజెపి డబుల్ అన్యాయ్ సర్కార్ కలిగించిన ఇబ్బందులను బాధితురాలి కుటుంబం ఎదుర్కొన్నది’ అని రమేష్ ఆరోపించారు. బాధితురాలు ప్రభుత్వ ఆసుపత్రిలో గాయాలతో మరణించడానికి ముందు 15 రోజుల పాటు జీవన పోరాటం సాగించిందని రమేష్ ఆరోపించారు. ఆ కుటుంబానికి న్యాయం కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించేందుకు యోగి ప్రభుత్వం వెనుకాడినట్లు తెలుస్తోందని రమేష్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News