మనతెలంగాణ/యాదాద్రి : యాదగిరిగుట్ట మున్సిపల్ కాంగ్రెస్ ఫోర్ లీడర్‌తో పాటు కౌన్సిలర్లు ఆ పార్టీకి షాకిచ్చి మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మున్సిపల్‌లో ఉన్నటువంటి నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు కారెక్కడంతో మున్సిపల్‌లో కాంగ్రెస్ ఖాళీ అయ్యింది. శనివారం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మున్సిపల్‌కు చెందిన కాంగ్రెస్ ఫోర్ లీడర్ గుండ్లపల్లి వాణీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్, కౌన్సిలర్లు ముఖ్యర్ల మల్లేష్, గౌళీకార్ అరుణరాజేష్, సరోజహరీష్, గౌరాయిపల్లి ఎంపీటీసీ సామల పద్మావతిప్రభాకర్, రేణికుంట ఎంపీటీసీ బొద్దుల మౌనికగణేష్‌లతో పాటు కాంగ్రెస్ నాయకుడు సుడుగు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీ జెండాను కప్పుకొని టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
యాదగిరిగుట్ట మున్సిపల్ అభివృధ్ధికై కాంగ్రెస్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెలిపారు. కాంగ్రెస్ నుండి టీఆర్‌ఎస్‌లో మంత్రి సమక్షంలో చేరిన సందర్భంగా యాదగిరిగుట్ట మున్సిపల్ అభివృధ్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌కు రావలసినటువంటి 30 శాతం గ్రాంట్‌ను వెంటనే మంజూరు చేస్తున్నట్లు, పట్టణంలో రహదారి వెంట ఉన్న సెంట్రల్ లైటింగ్‌ను వెలిగించి వాటి విద్యుత్ బిల్లులను వైటీడీఏ కట్టుకునేలా వైటీడీఏ వైస్ చైర్మెన్ కిషన్‌రావుకు ఆదేశించినట్లు, మున్సిపల్ ప్రత్యేక నిధులు కేటాయించి మరింత అభివృధ్ధికి మంత్రి హామి ఇచ్చినట్లు విప్ తెలిపారు.
మున్సిపల్‌లో ఖాళైన కాంగ్రేస్..
యాదగిరిగుట్ట గ్రామ పంచాయతీ నుండి తొలిసారిగా మున్సిపల్ కార్యాలయం ఏర్పడినాక 12 వార్డులకు గాను హోరాహోరి పోటీలో టీఆర్‌ఎస్‌కు 4 స్థానాలు, కాంగ్రేస్‌కు 4 స్థానాలు, సీపీఐ 2 స్థానాలు, టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి మద్దతుతో, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఎక్స్‌అఫిషీయో ఓట్లతో అధికార పార్టీ చైర్మెన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. నాటి నుండి నేటి వరకు పోటాపోటీగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం కొనసాగినప్పటికీ కాంగ్రేస్‌కు చెందిన నలుగురు కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌లో చేరడంతో మున్సిపల్‌లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఖాళీ అయ్యింది. 12 సీట్లకు గాను కాంగ్రెస్ కౌన్సిలర్ల చేరికతో టీఆర్‌ఎస్ సంఖ్య 9కు చేరుకుంది. 2 సీపీఐ, 1 స్వతంత్ర అభ్యర్థి కౌన్సిలర్లు ఉన్నారు.
కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌లో చేరికల పర్వం..
ఆలేరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో గత రెండు మాసాలుగా టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతుంది. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రేస్, బీజేపీ, ఇతర పార్టీలతో పాటు ఆయా గ్రామాల యువకులు భారీగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. చేరికలలో భాగంగానే యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు, యాదగిరిగుట్ట మండల ఎంపీటీసీ, రాజపేట మండల ఎంపీటీసీలతో పాటు కాంగ్రెస్ పార్టీలోని పలువురు నాయకులు మంత్రి సమక్షంలో చేరికలు జరిగాయి. డిసెంబర్ మాసంలో ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా తెలుస్తుంది.