ఢిల్లీకి చేరిన ఎమ్మెల్యేల బృందం
భోపాల్ : పంజాబ్ తరువాత ఇప్పుడు చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత ముసలం ముదిరింది. రాష్ట్రానికి చెందిన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం నుంచి దేశ రాజధానిలో మకాం వేసి ఉన్నారు. రాహుల్ గాంధీని కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి భూపేష్ బగేల్‌కు విధేయులు అయిన ఎమ్మెల్యేలు బృందంగా ఢిల్లీకి వచ్చినట్లు తెలిసింది. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రొటేషన్ పద్ధతిలో సిఎంల మార్పిడికి రాహుల్ గాంధీ మాటిచ్చారు. దీని కోసం ఇప్పటికే రాహుల్ బస్తర్ పర్యటన ఖరారు అయింది.
ఇప్పటికిప్పుడు పర్యటనకు రావద్దని, సిఎంగా బగేల్ కొనసాగేలా చూడాల్సి ఉందని రాహుల్‌కు తెలియచేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం ఢిల్లీలో మకాం వేసి ఉంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత కుదిరిన ఒప్పందంలో భాగంగా తరువాతి సిఎం స్థానం కాంగ్రెస్ మరో నేత టిఎస్ సింగ్ దేవ్‌కు దక్కాల్సి ఉంది. ఇచ్చిన మాట ప్రకారం తనకు పదవి దక్కాలని సింగ్‌దేవ్ కోరుతున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రతరం అయింది. ఇది ఎంతదూరం వెళ్లుతుందో తెలియని స్థితి నెలకొనడంతో కాంగ్రెస్ వర్గాలు కంగుతింటున్నాయి. రాహుల్‌ను రాష్ట్రంలో పర్యటనకు తొందరగా తీసుకురావాలని సింగ్‌దేవ్ వర్గం యత్నిస్తోంది. ఇందుకు ప్రతిగా సిఎం అనుచరుల బృందం ఆయన పర్యటన వద్దని పట్టుపడుతోంది.