ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంపై కాంగ్రెస్ విమర్శ
భారత్ ప్రపంచ ఉత్పత్తి కేంద్రం కాలేదు
బిజెపి వాగ్దానం నెరవేరలేదు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపణ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ‘మేక్ ఇన్ ఇండియా’ (భారత్‌లో తయారీ) పథకంపై మోడీ ప్రభుత్వాన్ని శనివారం తూర్పారబట్టారు. ‘మోడీ ప్రభుత్వ ‘భారత్‌లో తయారీ’ సాఫల్యంలో కన్నా ప్రచార ఆర్భాటానికి మచ్చుతునక. 2014 మేనిఫెస్టోలో భారత్‌ను ‘ప్రపంచ ఉత్పత్తి కేంద్రం’ చేసేందుకు బిజెపి పది వాగ్దానాలు చేసింది. వాటిలో ఏవీ నెరవేరలేదు’ అని ఖర్గే ‘ఎక్స్’ పోస్ట్‌లో ఆరోపించారు. పరిస్థితి ‘అధ్వానంగా’ మారిందని, ఉత్పత్తి సంస్థల్లో ఉపాధి కల్పన, జిడిపిలో తయారీ వాటా ‘భారీగా క్షీణించాయి’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు విమర్శించారు.
‘పిఎస్‌యులను విక్రయిస్తున్నారు. ఎంఎస్‌ఎంఇలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అధికార యంత్రాంగం అవరోధాలు పరిపాటిగా మారాయి. భారతీయ వాణిజ్యవేత్తలు భారత్‌ను ఎంచుకోవడానికి బదులు విదేశాలకు తరలిపోతూ, ఆక్కడ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఎగుమతులు యథేచ్ఛగా క్షీణిస్తున్నాయి’ అని ఆయన ఆరోపించారు. ఖర్గే రెందు నిర్దిష్ట ప్రశ్నలు సంధించారు. ‘గుర్తించిన 14 రంగాల్లో 12 రంగాలు ముందుకు సాగని అనంతరం ఎంతో ప్రచారం చేసిన, రూ. 1.97 లక్షల కోట్లు విలువ చేసే పిఎల్‌ఐ పథకం మొదటి దశకు మోడీ ప్రభుత్వం స్వస్తి పలికిందా? భారత మొత్తం ఎగుమతుల్లో సరకుల వాటా మోడీ ప్రభుత్వం కింద కనీసం 50 ఏళ్లలో కనిష్ఠ స్థాయికి పడిపోయింది?’ అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ హయాంలో భారత చరిత్రలోనే అది అత్యంత వేగంగా పెరిగిందనేది వాస్తవం అని ఖర్గే అన్నారు. ‘సిసలైన ‘ఆత్మనిర్భర్ భారత్’ కాంగ్రెస్ హయాంలోనే చోటు చేసుకుందని బహుశా మోడీజీ ఇప్పుడు గ్రహిస్తారేమో’ అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 2024 అక్టోబర్ నాటికి తయారీ ప్రోత్సాహకాల కోసం కేటాయించిన నిధుల్లో 8 శాతం కన్నా తక్కువగా మోడీ ప్రభుత్వం వినియోగించిందని, ఉత్పత్తి లక్షంలో 37 శాతం మాత్రమే సాధ్యమైందని సూచిస్తున్న మీడియా వార్తలను కూడా ఖర్గే ఉటంకించారు.