ఈ నెల 16న సిడబ్లుసి భేటీ
నాయకత్వం ….అంతర్గతంపై నజర్
అసెంబ్లీ ఎన్నికలపై విశ్లేషణ?
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార కార్యవర్గం అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్యుసి) సమావేశం ఈ నెల 16న జరుగుతుంది. పార్టీ నూతన అధ్యక్షఎన్నిక, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల అంశాలు ప్రధానంగా చర్చకు వస్తాయి. పంజాబ్‌లో సిఎం మార్పు, ఈ మధ్యకాలంలో చత్తీస్‌గఢ్‌లో పార్టీ అంతర్గత వ్యవహారాలు వంటివి సోనియా, రాహుల్ నాయకత్వానికి కీలక పరీక్షలుగా మారాయి. మరో వైపు పార్టీలోని సీనియర్ల బృందం జి 23 తిరిగి అంతర్గత వ్యవహారాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ తరుణంలోనే పార్టీ సిడబ్యుసి భేటీ ఖరారు అయింది. వచ్చే శనివారం అంటే ఈ నెల 16వ తేదీన ఉదయం పదిగంటలకు ఇక్కడి 24 అక్బర్ రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరుగుతుందని ఓ ప్రకటన వెలువడింది.
దేశంలో రాజకీయ పరిస్థితి, అసెంబ్లీ ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలు సిడబ్లుసి చర్చనీయ అజెండా అని ఇందులో తెలిపారు. పార్టీలో ఇటీవలి తీవ్ర పరిణామాల నేపథ్యంలో అధినాయకత్వం అంతర్గతంగానే కాకుండా వెలుపల కూడా తీవ్రస్థాయి విమర్శలు ఎదుర్కొంటోన్న దశలో వర్కింగ్ కమిటీ భేటీ ఉంటుందని గతవారమే సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలిపారు. పార్టీలో ఈ మధ్యకాలంలో పేరు మోసిన సీనియర్ల నుంచి బహిరంగ లేఖాస్త్రాలు ఎక్కువవుతూ వస్తున్నాయి. ఈ మధ్యనే పార్టీ నేత కపిల్ సిబల్ గాంధీలకు లేఖ రాశారు. పార్టీకి ఎన్నిక ప్రక్రియలో ఇంతవరకూ పూర్తిస్థాయి అధ్యక్షులు లేరని, ఇంతకు కీలక విషయాలపై ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? అంతర్గత అంశాలపై జవాబుదారి ఎవరు? అని ఆయన సంధించిన లేఖ పలు రీతిలో చర్చకు దారితీసింది. అంతేకాకుండా తాము నిజంగానే జి 23లమని, అయితే జి హుజూర్‌లం కామని, అంతర్గత వ్యవహారాలపై సందేహాలు ప్రశ్నలు లేవెనెత్తుతూ ఉంటామని పేర్కొన్న సిబల్ ఈ లేఖలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే నేరుగా ఎక్కడా సోనియా, రాహుల్ గాంధీల పేర్లను ప్రస్తావించలేదు. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై పార్టీలోని వర్గాలు భగ్గుమన్నాయి. కొందరు కార్యకర్తలు ఆయన ఇంటివెలుపల ధర్నాకు దిగారు. టమాటలు విసిరారు. కారును ధ్వంసం చేశారు. పార్టీలో అంతా బాగు అయ్యే దశలో వివాదాలకు దిగుతావా? అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.