మేనిఫెస్టో కమిటీ, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీలతో పాటు…
పలువురు అసంతృప్తులకు చోటు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కసరత్తు స్పీడ్ పెంచింది. ఇప్పటికే టికెట్ల కేటాయింపు కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఫైనల్ రిపోర్ట్‌ను ఢిల్లీకి పంపింది. ఇదిలా ఉండగానే ఎన్నికల వేళ కీలకమైన 8 కమిటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అసంతృప్తులకు ఈ కమిటీలో చోటు కల్పించి వారిని కాంగ్రెస్ పార్టీ శాంతపరిచింది. అందులో భాగంగా మేనిఫెస్టో కమిటీ, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ, ఏఐసిసి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, పబ్లిసిటీ, చార్జీషీట్, ఎక్స్‌అఫిషియో మెంబర్స్, కమ్యూనికేషన్స్, ట్రైనింగ్, స్ట్రాటజీ కమిటీలను శనివారం టీ కాంగ్రెస్ ప్రకటించింది. మేనిఫెస్టో కమిటీ, చైర్మన్‌గా మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మేనిఫెస్టో కమిటీ కో -చైర్మన్‌గా మాజీమంత్రి గడ్డం ప్రసాద్‌లను నియమించింది. ఇక, మరో కీలకమైన ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీకి సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సిఎం దామోదర్ రాజనర్సింహను ఎంపిక చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ కమిటీలను ప్రకటించింది.
ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా..
ఎన్నికల నిర్వహణ కమిటీచైర్మన్‌గా దామోదర రాజనర్సింహను నియమించారు. ఇందులో సభ్యులుగా వంశీచంద్ రెడ్డి, ఇ. కొమురయ్య ,జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నమిడ్ల శ్రీనివాస్, జగన్లాల్ నాయక్, సుప్రభాత్ రావు, భారత్ చవాన్, ఫక్రుద్దీన్ నియమించినట్లు ఏఐసిసి పేర్కొంది.
మేనిఫెస్టో కమిటీ
మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మేనిఫెస్టో వైస్ చైర్మన్‌గా గడ్డం ప్రసాద్‌ను నియమించారు. సభ్యులుగా దామోదర రాజనర్సింహ, పూనాల లక్ష్మై, బలరాం నాయక్, ఆర్.దామోదర్ రెడ్డి, జి. చిన్నారెడ్డి, సంభాని చంద్రశేఖర్, పోట్ల నాగేశ్వరరావు, రమేష్ ముదిరాజ్, ఒబైదుల్లా కొత్వాల్, తాహెర్ బిన్ హమ్దాన్, యర్రా శేఖర్, జి నాగయ్యా, జి. సుజాత, రవళి రెడ్డి, కె. వెంకటస్వామి, మర్రి ఆదిత్య రెడ్డిని ఎంపిక చేశారు.
ఏఐసిసి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్‌గా బలరాం నాయక్
ఏఐసిసి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్‌గా బలరాం నాయక్, పబ్లిసిటీ కమిటీకి చైర్మన్‌గా షబ్బీర్ అలీ, వైస్ చైర్మన్‌గా అనిల్‌కుమార్, చార్జీషీట్ కమిటీకి చైర్మన్‌గా సంపత్‌కుమార్, వైస్ చైర్మన్‌గా రాములు నాయక్, కమ్యూనికేషన్ కమిటీ చైర్మన్‌గా చెట్టి కుసుం కుమార్, వైస్ చైర్మన్‌గా మధన్‌మోహన్ రావు, ట్రైనింగ్ కమిటీ చైర్మన్‌గా పొన్నాల లక్ష్మయ్య, కన్వీనర్‌గా పవన్ మల్లాది, స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌గా ప్రేమ్‌సాగర్‌లను కాంగ్రెస్ పార్టీ నియమించింది.