అయోధ్య రామాలయ ఆహ్వానంపై కాంగ్రెస్ ప్రకటన
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి హాజరుకావడం లేదని కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ఆర్‌ఎస్/బిజెపి ప్రాజెక్టుగా సామాజిక మాధ్యమం ఎక్స్(పూర్వ ట్విటర్)లో రాసిన పోస్టులో కాంగ్రెస్ అభివర్ణించింది.
అయోధ్యలో జనవరి 22న జరిగిన ఆలయ ప్రతిష్టాపన మహోత్సవానికి మల్లికార్జున్ ఖర్గే; సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానాలు అందాయి. అయోధ్యలోని ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ఏనాడో మార్చివేశాయని కాంగ్రెస్ ఆరోపించింది. భగవాన్ శ్రీరాముడిని మన దేశంలోని కోట్లాది మంది కొలుస్తారని, మతం అన్నది వ్యక్తిగత వ్యవహారమని కాంగ్రెస్ తెలిపింది.
అయితే అయోధ్యలోని ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి ఏనాడో మార్చివేశాయని ఆరోపించింది. ఎన్నికల్లో లబిద్ధపొందేందుకే అసంపూర్ణ ఆలయానికి ప్రారంభోత్సవం చేయాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు నిర్ణయించారని కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటూ, భగవాన్ శ్రీరాముడి పట్ల కోట్లాది ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆర్‌ఎస్‌ఎస్/బిజెపి కార్యక్రమంగా స్పష్టంగా కనపడుతున్న ఈ కార్యక్రమ ఆహ్వానాన్ని మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది.
అది వారిష్టం: విహెచ్‌పి
అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరుకాకూడదని కాంగ్రెస నాయకులు తీసుకున్న నిర్ణయంపై విశ్వ హిందూ పరిషద్(విహెచ్‌పి) స్పందించింది. రామ్ లల్లా కార్యక్రమానికి హాజరుకాకూడదని కాంగ్రెస్ నాయకులు భావిస్తే అది వారిష్టమని విహెచ్‌పి వ్యాఖ్యానించింది. ఇలా ఉండగా ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మాత్రం తాను అయోధ్యకు వెళతానని చెప్పారు. అయితే తాను జనవరి 15న రామ్ లల్లా దర్శనం కోసం అయోధ్య వెళతానని, సరయూ నదిలో పుణ్యస్నానం ఆచరిస్తానని ఆయన తెలిపారు. తనకు ప్రాణప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానం అందచలేదని ఆయన తెలిపారు.