Monday, December 23, 2024

కంచుకోటల్లో కాంగ్రెస్ ఢమాల్

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొన్న
నాగార్జునసాగర్.. నేడు మునుగోడు
అంతర్గత కుమ్ములాటలే కారణం

 

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ఢమాల్ అయ్యింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. వరుస ఎన్నికల్లో ఓటములను మూటగట్టుకుంది. కాంగ్రెస్‌కు కంచుకోటలుగా భావించే నియోజవర్గాల్లోనే ఉనికిని కోల్పోయి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది. మునుగోడు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిలపడింది. ఏ ఉపఎన్నికల్లోనైనా కాంగ్రెస్‌కు డిపాజిట్లు తెచ్చుకోవడం గగనంగా మారింది. ఒక్క నాగార్జునసాగర్ ఉపఎన్నికలో మాత్రమే కాస్త టిఆర్‌ఎస్‌కు పోటీనివ్వగలిగింది. కానీ మళ్లీ తారుమారైంది.

మునుగోడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట. కానీ అక్కడా ఓటమిని ముద్దాడింది. ఏపీ సంగతి వదిలేస్తే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇక్కడ తిరుగులేని శక్తిగా మారుదామనుకుంటే ఏ మాత్రం కాంగ్రెస్‌కు కాలం కలసి రావడం లేదు. బిజెపి కొత్త ఉత్సాహంతో ముందుకు వచ్చింది కానీ కాంగ్రెస్ వెనుకబడిపోవడం గమనించదగిన పరిణామం. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ గెలిస్తే ఫలానా నేత సిఎం అవుతాడు, తాము ఎందుకు కష్టపడాలని ఇతర నేతలు అనుకోవడం, గెలిచేది కాం గ్రెస్ పార్టీనే అనుకోలేని తత్వం ఆ పార్టీ నేతల్లో పెరగడం తో ఏ ఎన్నికలోనూ విజయం దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. దుబ్బాక, హుజూరాబాద్‌లో పరువు పోగొట్టుకుం ది. డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దైన్య స్థితి కాంగ్రెస్‌ది. నాగార్జున సాగర్‌లో బిజెపి చేరికలను ప్రోత్సహించలేకపోయిది.

అక్కడ కూడా జనారెడ్డి లేదా ఆయన కుమారుడు బిజెపిలో చేరి పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి మరోసారి కాంగ్రెస్‌కు గండి కొట్టారు. ఉపఎన్నికల ఫలితాలకు, అసెంబ్లీ ఎన్నికల్లో జరగబోయే పోరాటానికి సంబంధం ఉండదు. ఓ నియోజకవర్గం ఓ స్పెషల్ అజెండా ప్రకారం జరిగే ఎన్నికలకు ప్రభుత్వాన్ని మార్చాలా? వద్దా? అన్న అజెండాతో జరిగే ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అందుకే తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాసింత ఆశాభావంతోనే ఉన్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సక్సెస్ కావడంతో పాటు భవిష్యత్ నేతగా రాహుల్ గాంధీకి అత్యధిక మంది మద్దతు పలుకుతున్నారని నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మార్పు వస్తుం దని, ప్రజలంతా కాంగ్రెస్ వెంటనే ఉంటారని నమ్ముతున్నారు. కాంగ్రెస్‌కు మునుగోడు ఉప ఎన్నిక కలిసి రాలేదు.

ఓవైపు సీనియర్లు దూరం పా టించారు. సానుభూతి వర్కౌట్ అవుతుందని భావించినా అదీ బెడిసికొట్టింది. ఆడబిడ్డ, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారసురాలు అంటూ ప్రచారం చేసినా ఓటర్లు కనికరం చూపలేదు. మునుగోడులో ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని బిజెపి, టిఆర్‌ఎస్ కుట్ర చేస్తున్నట్లుగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ను బతికించాలంటూ కన్నీటి అప్పీ లు చేసినా ఫలితం దక్కలేదు. మరోవైపు సొంత పార్టీ నేత లు కూడా వ్యతిరేకంగా పని చేశారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ తరుపున మునుగోడులో పోటీ చేసేందుకు పాల్వాయి స్రవంతితో పాటుగా వ్యాపారస్తుడు కృష్ణారెడ్డి, కైలాస్నేత, పల్లె రవి పోటీ పడ్డారు. కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలు ఎంపిలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి సహా పలువురు స్రవంతికి టికెట్ ఇవ్వాలని ఎఐసిసి ముందు పట్టుబట్టడంతో పాల్వాయి స్రవంతికి టికెట్ ఖరారు చేశారు.

తాము ప్రతిపాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ నిలబెట్టినప్పటికీ ప్రచారంలో మాత్రం సదరు సోకాల్డ్ నేతలంతా అంటీముట్టన్నట్లుగా వ్యవహరించారు. ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక్క పూట కూడా తిరిగిన దాఖలా లేదు. అంతేకాకుండా ఆయన తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి అనుకూలంగా పని చేశారనే అపవాదు కూడా ఉంది. మరో ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రచారంలో తక్కువగా కనిపించారు. జోడో యాత్ర పేరుతో రాహుల్ వెంటే ఉన్నారు. ఇక జానారెడ్డి అసలు ఉన్నారా? లేరా? అన్నట్టే ఉన్నారు. అన్ని పార్టీల కంటే ముందుగానే పాల్వాయి స్రవంతి ప్రచారాన్ని షురూ చేశారు.పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ కోసం ముందు నుంచీ పని చేస్తున్న తనకు మద్దతుగా ఉండాలంటూ ఓటర్లను వినమ్రంగా వేడుకున్నా ఫలితం లేకపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News