ఆరెస్సెస్ బిజెపిని పార్టీ ఓడించగలదు
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
గుజరాత్‌లో పార్టీ పునరుజ్జీవానికి నాంది
మోదసా (గుజరాత్) : గుజరాత్‌లో కాంగ్రెస్ శ్రేణులు ‘నైతిక స్థైర్యం కోల్పోయినట్లుగా’ కనిపిస్తోందని లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం అంగీకరించారు. తమ పార్టీ మాత్రమే ఆర్‌ఎస్‌ఎస్‌బిజెపి ద్వయాన్ని ఓడించగలదని ఆయన స్పష్టం చేశారు. కాషాయ ప్రత్యర్థులతో పోరును సైద్ధాంతిక పోటీగా ఆయన అభివర్ణించారు. గుజరాత్‌లో రాహుల్ పర్యటించడం ఒక వారంలో ఇది రెండవ సారి. రాష్ట్రంలో పార్టీ పునరుజ్జీవానికి రాహుల్ ఒక వ్యూహాన్ని ప్రతిపాదించారు. క్రియాశీలకంగా లేని, లేదా ‘బిజెపి కోసం పని చేస్తున్న’ పార్టీ నాయకులను తొలగిస్తామని ఆయన వాగ్దానం చేశారు. ఒకప్పుడు శక్తిమంతమైన రాజకీయ శక్తిగా కాంగ్రెస్ ఉన్న రాష్ట్రం గుజరాత్ ప్రతిపక్షానికి అత్యంత ముఖ్యమైన రాష్ట్రం అని ఆయన పేర్కొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ను, సుమారు 30 సంవత్సరాలుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న బిజెపిని చిత్తు చేయాలన్న దృఢసంకల్పాన్ని రాహుల్ వ్యక్తం చేశారు. గుజరాత్‌లో సంస్థ పునరుజ్జీవానికి వృద్ధ పార్టీ పథకంలో భాగంగా జిల్లా శాఖలను పటిష్ఠం చేసే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన తరువాత రాహుల్ ఆరావళి జిల్లా మోదసా పట్టణంలో బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. గుజరాత్‌లో 2027 ద్వితీయార్ధంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒక ఎఐసిసి పరిశీలకుడు, నలుగురు రాష్ట్ర పరిశీలకులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ ఆరావళి జిల్లాతో ఆరంభించి గుజరాత్‌లో పార్టీ 41 జిల్లా శాఖలు (ఎనిమిది నగరాలతో సహా) ఒక్కొక్కదానికి కొత్త అధ్యక్షులను నియమించే ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. మరిన్ని అధికారాలు దత్తం చేయడం, జిల్లా శాఖలకు నిధులు సమకూర్చడం, సీనియర్ నేతల పని తీరును మదింపు వేయడం, అట్టడుగు క్రియాశీలక కార్యకర్తలను ప్రమోట్ చేయడం, చురుకుగా లేని, లేక ‘బిజెపి కోసం పని చేస్తున్న’ నాయకులను తొలగించడం వంటి పలు వాగ్దానాలను రాహుల్ తన ప్రసంగంలో కార్యకర్తలకు చేశారు. ‘ఇది సిద్ధాంతాల మధ్య సమరం. సిద్ధాంతాలు ఉన్న పార్టీలు రెండే ఉన్నాయి.
ఒకటి బిజెపి, రెండవది కాంగ్రెస్. కాంగ్రెస్ మాత్రమే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఓడించగలదు. గుజరాత్ పార్టీకి ఎంతో ముఖ్యమైన రాష్ట్రం. ఎందుకంటే బిజెపి పరాజయానికి మార్గం గుజరాత్ మీదుగానే సాగుతుంది’ అని ఆయన చెప్పారు. ‘ఒక విధంగా గుజరాత్ నుంచి వచ్చిన పార్టీ మహోన్నత నేతలు మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిలోకి వచ్చింది’ అని రాహుల్ సభికులతో చెప్పారు. సుమారు మూడు దశాబ్దాలుగా గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలో లేనందున రాష్ట్రంలో పార్టీ శ్రేణులు ‘నైతిక స్థైర్యం కోల్పోయారు’ అని అంగీకరించిన రాహుల్ కాషాయ పార్టీని ఓడించడం కష్టం ఏమీ కాదని స్పష్టంచేశారు. ‘ఇక్కడ బిజెపిని ఓడించడం కష్టమని మీరు భావిస్తుంటారు.
బిజెపిని ఓడించడం తేలిక అని, మనం కచ్చితంగా ఆ పని చేయగలమని మీతో చెప్పడానికే ఇక్కడిక వచ్చాను. పార్టీ పని తీరులో కొన్ని మార్పులు మనకు అవసరం. నాయకుల మధ్య విధ్వంసకర పోటీ, స్థానిక నాయకత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికల టిక్కెట్ల పంపిణీ వంటి కొన్ని సమస్యలను స్థానిక నాయకులు ప్రధానంగా ప్రస్తావించారు’ అని ఆయన తెలిపారు. రేసు గుర్రాలు, పెళ్లి ఊరేగింపు గుర్రాలు, గాయపడిన గుర్రాలు అనే మూడు కేటగరీలుగా కాంగ్రెస్ నాయకులను రాహుల్ వర్గీకరించారు. గుజరాత్‌లో పార్టీ బాగా పని చేయడం లేదని, ఎందుకంటే రేసు గుర్రాలను ‘పెళ్లిళ్లలో నాట్యంచేయిస్తున్నారు’ అని, ‘నాట్యం’ కోసం ఉద్దేశించినవాటిని రేసు (ఎన్నికల పోరు)లో పాల్గొనవలసిందని కోరుతున్నారని ఆయన చెప్పారు. ‘వారిని వేరు చేయవలసిన సమయం వచ్చింది.
మేము రేసు గుర్రాలను (ఎన్నికల్లో) పరుగెత్తేలా, పెళ్లి గుర్రాలను (ఏ పనీ ఇవ్వకుండా) నాట్యం చేసేలా చేస్తాం. జిల్లా శాఖలు అహ్మదాబాద్ నుంచి కాకుండా జిల్లాల నుంచే పని చేయాలి. అందుకే జిల్లా అధ్యక్షులకు మరిన్ని అధికారాలు దత్తం చేసే ప్రక్రియను మేము ప్రారంభించాం’ అని రాహుల్ తెలిపారు. ఐదుగురు సభ్యుల కమిటీ ప్రతి జిల్లాలో పార్టీ కార్యకర్తలను కలుసుకుని, జిల్లా అధ్యక్షులు కాగల ఐదు ఆరుగురు అభ్యర్థుల పేర్లను సంక్షిప్త జాబితాలో చేరుస్తారు. ఎంపికైన జిల్లా అధ్యక్షుడు ‘పై నుంచి ’ఉత్తర్వులు లేదా ఎటువంటి జోక్యమూ లేకుండా జిల్లా శాఖ నిర్వహణకు నిర్ణయాలు తీసుకుంటారు’ అని ఆయన వాగ్దానం చేశారు. ‘పార్టీ యంత్రాంగం, పార్టీ అభ్యర్థుల మధ్య అనుసంధానం ఉండాలి. ఎన్నో సార్లు ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎంఎల్‌ఎ తన విజయంలో ముఖ్య పాత్ర పోషించిన సంస్థ గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు సంస్థే అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.పై నుంచి ఎవ్వరూ అభ్యర్థుల గురించి నిర్ణయం తీసుకోబోరు’ అని రాహుల్ చెప్పారు.