Sunday, January 19, 2025

పరాకాష్ఠకు కాంగ్రెస్ పరాజయాలు

- Advertisement -
- Advertisement -

తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు 28 రాజకీయ పక్షాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి వేదిక ‘ఇండియా’ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. లోక్‌సభ ఎన్నికలకు గట్టిగా నాలుగు మాసాల వ్యవధి కూడా లేకపోవడంతో ఈలోగా ‘ఇండియా’ కూటమి లోపాలను సవరించుకొని, నాయకత్వ సమస్యను పరిష్కరించుకొని, బలమైన ఉమ్మడి ప్రతిపక్షశక్తిగా రూపొందగలుగుతుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది.ఈ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా బిజెపి గెలుపొందే అవకాశాలు లేవని చాలా మంది పరిశీలకులు భావిస్తూ వచ్చారు. బిజెపి అంతర్గత సర్వేలు సహితం మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో పరాజయం తప్పదని ఆరు నెలల ముందుగానే స్పష్టం చేశాయి. దానితో ఈ నాలుగు రాష్ట్రాల్లో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామనే ధీమా కాంగ్రెస్ వర్గాలతో వ్యక్తం అవుతూ వచ్చింది.

అయితే, తీరా ఫలితాలు వచ్చేసరికి అంచనాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దాదాపు అందరూ భావించిన చత్తీస్‌గఢ్‌లో సహితం ఎవ్వరూ ఊహించని ఆధిక్యతతో బిజెపి విజయం సాధించింది. తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఎదురవుతుందని భావిస్తున్న మధ్యప్రదేశ్‌లో దాదాపు మూడింట రెండొంతుల ఆధిక్యతతో బిజెపి పొందింది. పలువురు విశ్లేషకులు భావిస్తున్నట్లు ఈ ఫలితాలు బిజెపి విజయాల కన్నా కాంగ్రెస్ పరాజయాలను వెల్లడి చేస్తున్నాయి.
మూడు కీలక రాస్ట్రాలలో బలమైన నాయకులుగా గుర్తింపు పొందిన మాజీ ముఖ్యమంత్రులను పక్కనపెట్టి కేవలం ‘మోడీ గ్యారంటీ’ నినాదంతో పోటీకి దిగిన బిజెపి నలుగురు కేంద్ర మంత్రులతో సహా 18 మంది ఎంపిలను పోటీకి దింపింది. ఓ విధంగా కొత్త నాయకత్వం ఆ రాష్ట్రాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ముగ్గురు కేంద్ర మంత్రులతో సహా 14 మంది ఎంపిలు గెలుపొందారు. మరోవంక, కాంగ్రెస్ నాలుగు దశాబ్దాల క్రితం ‘సంజయ్ బ్రిగేడ్’ గా రాజకీయాల్లోకి వచ్చిన వారిపైననే ఇప్పటికీ ఎక్కువగా ఆధారపడింది.

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ (78), దిగ్విజయ్ సింగ్ (76), రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ (72) నేతృత్వం వహించారు. వారి మొండి వైఖరి కారణంగా చివరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలే విసుగు చెందారు. పైగా, వీరంతా ప్రత్యర్థి బిజెపిని కాకుండా సొంత పార్టీలోని ప్రత్యర్థులను కట్టడి చేయడం పట్లనే ఎక్కువగా దృష్టి సారించారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో గెలుపొందిన ఉత్సాహం కాంగ్రెస్‌లో కనిపించకుండా ఈ ఫలితాలు చేశాయి. మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయం లో ఈ ఫలితాలు సహజంగానే ప్రతిపక్షాలను కృంగదీస్తున్నాయి. బిజెపిలో వరుసగా మూడోసారి గెలవబోతున్నామనే ఉత్సాహం కలిగిస్తున్నాయి. ఈ ఫలితాలతో ఎట్లాగైనా బిజెపిని కట్టడి చేయడం కోసం 28 ప్రతిపక్షాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ‘ఇండియా’ కూటమి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా తయారైంది.కాంగ్రెస్ పెద్దన్న ధోరణుల పట్ల మిగిలిన ప్రతిపక్షాలు ఆగ్రవేశాలు వ్యక్తం చేసేందుకు బలమైన కారణాలున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తమతో పొత్తులు పెట్టుకోనందుకు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌పై అసంతృప్తిగా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి అంతగా ఉనికి లేదు.

ఆ పార్టీ మొత్తం ఓట్లలో 0.5% కూడా పొందలేదు.అయితే కాంగ్రెస్‌కు సుహృద్భావాన్ని సృష్టించే ఉద్దేశంతో రెండు -మూడు సీట్లు వదిలిపెట్టి వుంటే రేపు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ సీట్లు కోరే అవకాశం ఉండెడిది. వాస్తవానికి మూడు నెలల క్రితం ముంబై భేటీలో నెల రోజుల లోపుగా రాష్ట్రాల స్థాయిలో సీట్ల సర్దుబాట్లు పూర్తి చేసుకోవాలని నిర్ణయించి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కానీ, కేవలం కాంగ్రెస్ వైఖరి కారణంగా ఈ అంశంలో ముందడుగు వేయలేకపోయారు. ఈ మూడు రాష్ట్రాల్లో విజయం సాధిస్తే తమ ప్రాబల్యం పెరిగి సీట్ల సర్దుబాట్లలో పెద్దన్న పాత్ర పోషించవచ్చనే కాంగ్రెస్ ఎత్తుగడ ఇప్పుడు ఎదురు తిరిగింది. మరో వంక, బిజెపిలో ఈ ఫలితాలు సృష్టించిన సంబరాలు చూస్తుంటే ప్రతిపక్షాలకు సహితం పరిమితులను గుర్తించి ఏదో విధంగా సర్దుబాట్లకు సిద్ధపడటం కన్నా మరో గత్యంతరం కనిపించడం లేదు. అయితే నాయకుల మధ్య నెలకొన్న ‘అహంకార ధోరణులు’ కారణంగా అవసరమైన కార్యాచరణ చేపట్టలేక, ఎన్నికలు సమీపిస్తున్నా చురుకుగా వ్యవహరించలేకపోతున్నారు.
2018లో ఈ మూడు రాష్ట్రాలలో ఓటమి చెందిన బిజెపి మరో ఆరు నెలల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఘన విజయం సాధించడం గమనార్హం.

అందుకనే ఇప్పటికైనా జాగ్రత్త పడితే 2024 ఫలితాలపై అంతగా ఆందోళన చెందనవసరంలేదు. ప్రస్తుత రాజకీయ వాతావరణం బిజెపికి అనుకూలంగా కనిపిస్తున్నా ఆ పార్టీకి సహితం పూర్తిగా సానుకూల సంకేతాలు లేవని గమనించాలి. అందుకనే ఫలితాలు వచ్చిన తర్వాత బిజెపి అగ్రనాయకులలో మరింత ఆందోళన వ్యక్తం అవుతున్నది. మరుసటి రోజే ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యర్థులపై గతంలోకన్నా చాలా కరుకుగా వ్యవహరిస్తున్నారు. ఓ కాంగ్రెస్ ఎంపి వ్యాపారాలపై ఆదాయ పన్ను దాడులకు స్పందిస్తూ ‘అవినీతి సొమ్ము కక్కిస్తాం’ అంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనలో ఓ విధమైన అసహనం వెల్లడి అవుతున్నది. జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు సందర్భంగా కశ్మీర్ విషయంలో నెహ్రూ ఘోర తప్పిదాలకు పాల్పడ్డారని అమిత్ షా ఆరోపించడం, ప్రజా పంపిణీ వ్యవస్థపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలను పీయూష్ గోయల్ ‘పేదల వ్యతిరేకులు’ అంటూ నిందించడం, డిఎంకె ఎంపి సెంథిల్ కుమార్ వ్యాఖ్యలపై ‘దక్షిణ- ఉత్తరాది విభజన సృష్టిస్తున్నారు’ అంటూ మండిపడటం వంటివి ఓ విధమైన అసహనాన్ని సూచిస్తున్నాయి.

అందుకు కారణాలు లేకపోలేదు. మధ్యప్రదేశ్‌లో తప్ప రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో బిజెపి- కాంగ్రెస్ ఓట్ల మధ్య తేడా చాలా తక్కువగా ఉంది. ఈ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణను కూడా పరిగణనలోకి తీసుకుంటే బిజెపికన్నా కాంగ్రెస్‌కు 10 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇక లోక్‌సభ సీట్లను పరిశీలిస్తే 2019లో కన్నా బిజెపికి తక్కువ సీట్లు ఈ రాష్ట్రాలలో వచ్చే అవకాశాలను వెల్లడి చేస్తున్నాయి.ఇప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో 83 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. 2019లో వీటిలో బిజెపికి 65, కాంగ్రెస్‌కు 6 సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుత ఎన్నికలలో ఒక్కో పార్లమెంట్ స్థానానికి అసెంబ్లీవారీగా లభించిన ఓట్లను కలిపితే మధ్యప్రదేశ్‌లో బిజెపికి 24, కాంగ్రెస్‌కు 5 వచ్చాయి. 2019లో కాంగ్రెస్ 1 సీటు మాత్రమే గెలుచుకుంది. ఇక, చత్తీస్‌గఢ్‌లో బిజెపికి 8, కాంగ్రెస్‌కు 3. 2019లో కాంగ్రెస్‌కు 2సీట్లు మాత్రమే వచ్చాయి. రాజస్థాన్‌లో బిజెపికి 14, కాంగ్రెస్‌కు 11. 2019లో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలుచుకోలేదు.

తెలంగాణలో బిజెపికి 1 సీటు కూడా వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్‌కు 9 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. 2019లో బిజెపికి 4, కాంగ్రెస్‌కు 3 సీట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే బిజెపికి గత ఎన్నికలలో వచ్చిన సీట్లకన్నా 19 సీట్లు తక్కువగా 46 సీట్లు, కాంగ్రెస్‌కు 22 సీట్లు అదనంగా 28 సీట్లు లభించే అవకాశం కనిపిస్తుంది.అలా కాకుండా ఇండియా కూటమి పక్షాలు ఉమ్మడిగా పోటీ చేస్తే బిజెపి మరో 8 సీట్లు కోల్పోయి 38 సీట్లకు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇండియా కూటమికి 36 సీట్లు లభిస్తాయి. ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ చేసిన ఈ అంచనా ఉహాజనితమే కావచ్చు. కానీ ఫలితాలు ఏకపక్షంగా మాత్రం ఉండే అవకాశం లేదని స్పష్టం అవుతున్నది. 2019లో మాదిరిగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్‌సభ ఎన్నికలప్పుడు పునరావృతం కావనుకుంటే, ఆ ప్రమాదం బిజెపి కూడా ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు.
2019లో మాదిరిగా ఈ రాష్ట్రాలతో పాటు గుజరాత్, హర్యానా, ఢిల్లీలలో బిజెపి మరింతగా పుంజుకొంటుంది అనుకున్నా గతంలోనే పార్టీకి గరిష్ఠంగా ఈ రాష్ట్రాలలో సీట్లు ఆ పార్టీకి రావడం గమనార్హం. మరింతగా బలం పెంచుకొనే అవకాశం లేదు. కొద్దో గొప్పో ప్రతిపక్షాలకే అవకాశం ఉంటుందని గమనించాలి.

2019లో బిజెపి 303 సీట్లు గెలుచుకుంది. అంటే మెజారిటీ మార్కు కంటే కేవలం 30 సీట్లు ఎక్కువ గెలుచుకుంది. అయితే, 2024లో పశ్చిమ బెంగాల్, కర్నాటక, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడలేదు. తప్పనిసరిగా కొన్ని సీట్లు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో గెలుచుకున్న సీట్లను పరిగణన లోకి తీసుకున్నా ఆ రాష్ట్రంలో 10 వరకు లోక్‌సభ సీట్లను కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, తెలంగాణ, అసోంలలో కొంత ప్రతికూలత అనివార్యంగా కనిపిస్తున్నది. అంటే 2019 ఫలితాలు తిరిగి పొందడం బిజెపికి సవాల్‌తో కూడుకున్న అంశమే. అందుకనే కర్నాటకలో జెడిఎస్‌ను దగ్గరకు తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి, టిడిపి ల మధ్య దోబూచులాడటం, తమిళనాడులో దూరమైన అన్నా డిఎంకెను తిరిగి దగ్గరకు చేర్చుకొనే ప్రయత్నం చేయడం, తెలంగాణలో కొత్త వర్గాలకు దగ్గరయ్యే ఎత్తుగడలు అనుసరించడం చేస్తున్నది.

వీటన్నింటికి మించి ‘ఇండియా’ కూటమి ముందుగా అంచనా వేసుకున్న విధంగా 400 సీట్లలో బిజెపితో నేరుగా తలపడగలిగితే వచ్చే ఎన్నికలలో బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అందుకు వ్యక్తిగత అహంకారాలను పక్కకు నెట్టి మల్లికార్జున ఖర్గే, శరద్ పవర్ వంటి పరిణతి చెందిన నాయకుల మార్గదర్శనం అవసరం. అందుకు అవసరమైన రాజకీయ సంసిద్ధతను రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ఏమేరకు ప్రదర్శించగలరో చూడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News