న్యూఢిల్లీ: ఢిల్లీలో దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆమె కుటుంబానికి తక్షణం ఆర్థిక సహాయం ప్రకటించాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దళిత బాలిక కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పరామర్శించారు. బుధవారం రాహుల్‌గాంధీ వారి ఇంటికి వెళ్లి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఒక్క అంగుళం కూడా వెనక్కిపోమని రాహుల్ స్పష్టం చేశారు. దర్యాప్తుకు బాధిత కుటుంబం డిమాండ్ చేయకుండా ఢిల్లీ పోలీసులు ఒత్తిడి చేశారన్నదానిపైనా విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎస్,ఎస్‌టి కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఢిల్లీ పోలీసులు కేంద్ర పరిధిలోకి వస్తారని, ప్రధాని మోడీ ఈ ఘటనపై ఎందుకు మౌనం వహించారని కాంగ్రెస్ ప్రశ్నించింది.
ఢిల్లీ నైరుతి ప్రాంతంలోని పాత నంగల్‌లో 9 ఏళ్ల దళిత చిన్నారి అనుమానాస్పదస్థితిలో మరణించింది. ఆదివారం శ్మశానవాటికలో జరిగిన ఈ సంఘటనపై అక్కడి కాటికాపరిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన కూతురిపై కాటికాపరితోపాటు మరికొందరు అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత హత్యగావించారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్మశానవాటికలోని వాటర్‌కూలర్ వద్ద నీళ్లు పడుతుండగా బాలిక విద్యుత్ షాక్ తగిలి మరణించినట్టుగా కాటికాపరి తమను నమ్మించే ప్రయత్నం చేశాడని ఆమె తెలిపారు. బాలిక మరణించిన విషయం పోలీసులకు చెబితే, శవపరీక్ష పేరుతో ఆమె శరీరాన్ని కత్తులతో కోస్తారని చెప్పి హడావుడిగా మృతదేహాన్ని దహనం చేశాడని ఆమె తెలిపారు. ఈ ఘటనలో దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి కుటుంబసభ్యులతోపాటు స్థానికులు ఆందోళన చేపట్టారు. దాంతో, ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాటి కాపరితోపాటు మొత్తం నలుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ కూడా దర్యాప్తు ప్రారంభించింది.