Thursday, January 23, 2025

హిండెన్‌బర్గ్ నివేదిక: ‘సెబీ’ విచారణకు కాంగ్రెస్ డిమాండ్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ విషయంలో హిండెన్‌బర్గ్ నివేదికపై ‘సెక్యూరిటీస్ అండ్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’(సెబీ)తో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ శుక్రవారం డిమాండ్ చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఆరోపణలపై సీరియస్‌గా దర్యాప్తు జరపాలి, భారత ఆర్థిక వ్యవస్థ భద్రత స్థిరత్వానికి ఎవరు బాధ్యులు?…అంటే భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) వంటి ఏ సంస్థలు బాధ్యతవహిస్తాయి?’ అని జైరామ్ రమేశ్ ప్రశ్నించారు.

‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) వంటి ఆర్థిక సంస్థలు అదానీ గ్రూప్‌కు ‘హై ఎక్స్‌పోజర్’ను ఇచ్చాయి. భారతీయ కోట్లాది రూపాయల పొదుపుకు(సేవింగ్స్) డబ్బుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ‘అదానీ గ్రూప్’కు చాలా లీవరేజ్ ఇచ్చారని ఇదివరకటి నివేదికలే తెలిపాయి’ అని జైరామ్ రమేశ్ వివరించారు.
‘ఆర్థిక అవకతవకల ఆరోపణలు చాలా చెడ్డవి, కానీ అధ్వాన్నమైన విషయం ఏమిటంటే, ఎల్‌ఐసి, ఎస్‌బిఐ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు వంటి వ్యూహాత్మక ప్రభుత్వ సంస్థలు అదానీ గ్రూప్‌లో పెట్టిన ఉదార పెట్టుబడుల ద్వారా మోడీ ప్రభుత్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థను వ్యవస్థాగత నష్టాలకు గురిచేసుండొచ్చు’ అని ఆయన ఆరోపించారు.

‘ఎల్‌ఐసి, ఎస్‌బిఐ సంస్థలు అదానీ గ్రూప్‌కు ఉదారంగా ఆర్థిక సాయం అందించాయి. ఎల్‌ఐసి 8 శాతం ఈక్విటీ ఆస్తులు ఇప్పుడు అదానీ కంపెనీలో ఉన్నాయి. వాటి విలువ రూ. 74000 కోట్లు. ఇక ఎస్‌బిఐ ప్రైవేట్ బ్యాంకుల కన్నా రెట్టింపు రుణాలను అదానీ గ్రూపుకు ఇచ్చాయి. ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో 40 శాతం ఎస్‌బిఐవే’ అని జైరామ్ రమేశ్ తెలిపారు.
కోట్లాది మంది భారతీయులు ఎల్‌ఐసి, ఎస్‌బిఐలో తమ పొదుపును పెట్టారు. కానీ ఇప్పుడు అవి ఫైనాన్షియల్ రిస్క్‌లో ఉన్నాయి. అదానీ గ్రూప్ తన స్టాక్ విలువను కృత్రిమంగా పెంచుకున్నాయి. మ్యానిపులేషన్ ద్వారా తమ కంపెనీ స్టాక్ విలువను ఇబ్బడిముబ్బడిగా పెంచుకున్నాయి. ఆ షేర్లనే ఎస్‌బిఐ వంటి బ్యాంకుల వద్ద తనఖా పెట్టి నిధులు సేకరించాయి. ఆ షేర్ల విలువ కనుక పతనమైతే ఎస్‌బిఐ చాలా నష్టపోకతప్పదు.

‘మోడీ క్రోనీ క్యాపిటలిస్టులు తమ సంపదను ఎలా వేగంగా పెంచేసుకున్నారో భారతీయులకు బాగానే తెలుసు. అయితే తమ పొదుపు డబ్బే వారికి ఊతమైందన్నది కూడా వారు గ్రహించాల్సి ఉంది. ఆర్థిక స్థిరత్వానికి ఆర్‌బిఐ ఏమైనా చేస్తుందా? కనీసం పరిశోధన అన్నా చేస్తుందా? ఇవన్నీ క్లియర్‌కట్ ‘ఫోన్ బ్యాంకింగ్’ కేసులు కావా?’ అని జైరామ్ రమేశ్ అన్నారు. ప్రజల కళ్లుగప్పడానికి ప్రభుత్వం సెన్సార్‌షిప్ ను కూడా రుద్దవచ్చు. ‘కానీ భారతీయ వ్యాపారాలు, ఆర్థిక మార్కెట్ల ప్రపంచీకరణ యుగంలో కార్పొరేట్ దుష్పరిపాలనపై దృష్టి సారించే హిండెన్‌బర్గ్ నివేదికలను ‘హానికరమైనవి(మాలీసియస్)’ అని చెప్పి కొట్టిపారేసి, ప్రక్కన పడేయవచ్చా?’ అని జైరామ్ రమేశ్ సందేహాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News