Saturday, December 21, 2024

కామ్రేడ్లకు హస్తం ‘హ్యాండ్’ ?

- Advertisement -
- Advertisement -

పొత్తులపై వామపక్షాలకు హామీ ఇవ్వని కాంగ్రెస్
సిపిఐ, సిపిఎంలు అడిగే స్థానాల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు
కామ్రేడ్‌లతో పొత్తులను విభేదిస్తున్న కాంగ్రెస్ నాయకులు
వామపక్షాలకు అసెంబ్లీ సీట్లు కాకుండా వేరే పదవులు ఇవ్వాలని ప్రతిపాదన
త్వరలోనే తేలనున్న పొత్తుల పంచాయితీ

మనతెలంగాణ/హైదరాబాద్: కామ్రేడ్లకు హస్తం హ్యాండ్ ఇచ్చే పరిస్థితి కనబడుతోంది. కామ్రేడ్‌లు నాలుగు సీట్లను అడుగుతుంటే కాంగ్రెస్ మాత్రం రెండు సీట్లను కూడా గ్యారంటీ ఇచ్చే పరిస్థితి కనబడడం లేదన్న గుసగుసలు ఆ పార్టీలో వినబడుతున్నాయి. అయితే ఒకవేళ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే రెండు సీట్లను కూడా ఇవ్వొద్దని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అధిష్టానంతో పేర్కొన్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి చాలామంది ఆశావహులు పోటీ చేయడానికి భారీగా దరఖాస్తు చేసుకుంటున్న నేపథ్యంలో వామపక్షాలకు రెండు స్థానాలను కేటాయిస్తే ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు మద్ధతు ఇవ్వరని ఖరాకండిగా చెబుతున్నట్టుగా సమాచారం. అయితే ఒకవేళ కామ్రేడ్‌లతో పొత్తులు పెట్టుకుంటే, వారికి రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా వేరే పదవులను ఇప్పించేలా ఒప్పించాలని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి సూచించినట్టుగా తెలిసింది. ఇప్పటికే ఇదే పద్ధతిని షర్మిల విషయంలోనూ అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ, కామ్రేడ్‌ల విషయంలోనూ ఈ సూత్రానే పాటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఠాక్రే రహస్య మంతనాలు !
అయితే కాంగ్రెస్ నాయకుల ఆలోచన ఇలా ఉంటే కామ్రేడ్‌లు మాత్రం తమకు కచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం నాలుగు సీట్లను కేటాయించే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల సిపిఐ, సిపిఎంల రాష్ట్ర నాయకులతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసి మాట్లాడడంతో పాటు వారితో ఠాక్రే రహస్య మంతనాలు జరిపినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో తమకు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లను కేటాయిస్తుందని కామ్రేడ్‌లు తమ క్యాడర్‌తో పేర్కొనడం విశేషం.
కామ్రేడ్‌లు అడిగిన స్థానాల్లో భారీగా కాంగ్రెస్ ఆశావహుల దరఖాస్తులు
సిపిఐకి రెండు, సిపిఎంకు రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు కామ్రేడ్‌లు పేర్కొంటున్నారు. దీంతోపాటు కమ్యూనిస్టులు ఇండియా కూటమిలో ఉన్నారు. దీంతో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. కానీ, పొత్తులపై టి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మాత్రం బహిరంగంగా ఎలాంటి చర్చలు జరపలేదని, పొత్తులపై కనీసం క్లారిటీ కూడా ఇవ్వలేదని పేర్కొంటుండగా కామ్రేడ్‌లు మాత్రం తాము ఎప్పటికప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర, ఢిల్లీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నామని వారు పేర్కొంటున్నారు. పాలేరు, కొత్తగూడెం, భద్రాచలం, వైరా, మధిర, హుస్నాబాద్, బెల్లంపల్లి, మిర్యాలగూడ, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సీట్లను వామపక్షాలు అడుగుతుండగా, ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు ఉండడంతో పాటు ఆ స్థానాల్లో పోటీ చేయడానికి ఆశావహులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు.
కొన్ని రోజులు పొత్తులపై గప్‌చుప్
ఈ నేపథ్యంలోనే ఆ స్థానాలను కమ్యూనిస్టులకు ఇస్తే ఎలా అని ఆ స్థానాలను ఆశిస్తున్న నేతలు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే టి కాంగ్రెస్ నేతలు పొత్తులపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని తెలుస్తోంది. అయితే కమ్యూనిస్టులు అడుతున్న ప్రతి సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌కు బలమైన నేతలు ఉన్నారు. అయితే కమ్యూనిస్టులకు ఆ సీట్లను కేటాయించాలా కొత్తగా పార్టీలో చేరే వారితో పాటు పాత వారికి ఆయా స్థానాలను కేటాయించాలా అన్న దానిపై పునరాలోచనలో పడ్డట్టుగా తెలిసింది. దీంతోపాటు కామ్రేడ్‌లు అడిగిన స్థానాల్లో వారి బలం ఎంత, మన బలం ఎంత అన్న దానిపై కాంగ్రెస్ అధిష్టానం నివేదిక తెప్పించుకున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలన్న ఉద్ధేశ్యంతో అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగా కొన్ని రోజులు కమ్యూనిస్టుల పొత్తుల గురించి ఎలాంటి ప్రకటన చేయవద్దని ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. అయితే కామ్రేడ్‌లు మాత్రం ఎవరితో పొత్తులు కుదరకపోతే బలమైన స్థానాల్లో ఉమ్మడిగా పోటీచేయాలని ఇదివరకే నిర్ణయించడం విశేషం.

Manikrao Thckrey

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News