డెహ్రాడూన్: కులం, మతం, ప్రాంతం పేరిట ప్రజలను కాంగ్రెస్ విభజిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లోని కుమరో ప్రాంతానికి చెందిన అల్మోరాలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తూ ఉత్తరాఖండ్‌లో అభివృద్ధి హిమాలయ శిఖరాల అంచుకు తీసుకెళ్లేందుకు బిజెపికి మరోసారి అధికారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ అభివృద్ధే బిజెపి ధ్యేయమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీది విభజన సిద్ధాంతమని, ఈ విషయం ఉత్తరాఖండ్ ప్రజలకు బాగా తెలుసునని మోడీ అన్నారు. ప్రజలను కుల, మత, ప్రాంత, భాషా ప్రాతిపదికన చీల్చడడం కాంగ్రెస్ విధానమని, ప్రతి ఒక్కరినీ చీల్చడం, కలసికట్టుగా లూటీ చేయడం కాంగ్రెస్ సిద్ధాంతమని ఆయన ఆరోపించారు. ఎటువంటి వివక్ష లేని బిజెపి వైఖరి వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. 70 స్థానాల ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఈనెల 14న ఒకే విడతలో పోలింగ్ జరగనున్నది.