మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టు అయి తీహాడ్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు విన్పిస్తున్నారని అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలోని శ్రీ సూరగిరి ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కెసిఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.
కెసిఆర్ చెప్పిన వారికే రాష్ట్రంలో మంత్రి పదవులు, రాజ్యసభ పదవులు వస్తున్నాయన్నారు. కవిత బెయిల్ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ వకీల్‌గా పనిచేశారన్నారు. కేసీఆర్ చెప్పినందుకే తెలంగాణ రాష్ట్రం నుంచి అభిషేక్ మను సింఘ్వీకి తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానం వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలని విమర్శించారు. కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉండటంతో ఆమె కేంద్రంగా విలీనంపై మాటల తూటాలు పేలుతున్నాయి. కూతురు కవితకు బెయిల్ కోసం బీజేపీ పెద్దలతో కేసీఆర్ మిలాఖత్ అయ్యారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సిఎం రేవంత్ రెడ్డి కూడా పదేపదే ఇవే ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు అనుగుణంగానే అభిషేక్ సింఘ్వీకి తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధిగా నామినేషన్ వేయించారని తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని సంజయ్ ప్రశ్నించారు. కెసిఆర్ చెబితేనే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీట్లు, ప్రభుత్వంలో మంత్రి పదవులిస్తున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కెసిఆర్ ఫాంహౌజ్‌కు క్యూ కడుతున్నారని వ్యాఖ్యనించారు. పదేపదే బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం చేసుకోబోతున్నారంటూ దుష్ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు బండారం బయటపడిందన్నారు. కాంగ్రెస్ నేతలే కెసిఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీయే లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇఫ్పించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ కవిత బెయిల్ కోసం కోర్టులో వాదిస్తున్నారని తెలిపారు.
పెద్ద వకీలు అయిన సింఘ్వీ తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధి అవుతున్నాడంటే తెలంగాణ ప్రయోజనాల కోసం కోర్టులో, పార్లమెంట్‌లో గట్టిగ వాదిస్తడని అనుకున్నా, తీరా చూస్తే లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వాలని వాదిస్తున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. ఇన్నాళ్ళు కేసీఆర్ కుటుంబ అవినీతిని బట్టబయలు చేస్తాం, జైలుకు పంపిస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఆ కుటుంబాన్ని ఎందుకు జైలుకు పంపలేదని నిలదీశారు. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నందుకే కాళేశ్వరం, డ్రగ్స్, మియాపూర్ భూములు, ఫోన్ ట్యాపింగ్ కేసులన్నీ అటకెక్కించారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్, తుక్కు గూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్, పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.