Monday, December 16, 2024

మాదిగలకు ఇబ్బందులు రాకుండా ఎస్సీ వర్గీకరణ: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

ఆ నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇస్తాం
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ అనుకూలం
ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా వర్గీకరణను అమలు చేస్తాం
‘గ్లోబల్ మాదిగ డే-2024’ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఇబ్బందులు రాకుండా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను చేపడుతామని ఆ నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇస్తామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ అనుకూలమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధించి తమ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో తీర్పు దానంతట అదే రాలేదని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో క్రియాశీల పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాజకీయ, అధికార నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన వివరించారు. శనివారం మాదాపూర్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగిన గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

కొంత ఆలస్యం కావచ్చు.. మీకు తప్పకుండా న్యాయం చేస్తాం
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉందని, ఈ ప్రభుత్వంలో మాదిగలకు న్యాయం చేసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం మీకు అన్యాయం జరగనివ్వదని, న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ఆయన అన్నారు. అమలు చేయడంలో కొంత ఆలస్యం కావచ్చు, కానీ, మీకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్‌ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించామన్నారు. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంలో రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించి క్రియాశీల పాత్ర పోషించిందన్నారు.

ప్రజల ఆకాంక్షల మేరకే నిర్ణయం
సుప్రీంకోర్టు తీర్పును తూ.చా తప్పకుండా అమలు చేస్తామని శాసనసభ వేదికగా తమ ప్రభుత్వం ప్రకటించిందని సిఎం రేవంత్ తెలిపారు. అయితే తెలంగాణ విభజన సమస్యలా ఎస్సీ వర్గీకరణ సమస్య జఠిలంగా మారిందన్నారు. కానీ, ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మీ వాదనలో బలం ఉంది, మీకు న్యాయం చేయాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడంతో పాటు 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జ్యుడీషియల్ కమిషన్‌ను కూడా నియమించామని సిఎం తెలిపారు.

మరో వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. సిఎం పేషీలో మాదిగలు ఉండాలని డా.సంగీతను నియమించుకున్నామన్నారు. చరిత్రలో తొలిసారి ఓయూ విసిగా మాదిగను నియమించామని సిఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఐఐటీ విసిగా, విద్యా కమిషన్ మెబర్‌గా, ఉన్నత విద్యా శాఖలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించామన్నారు. పగిడి పాటి దేవయ్యను స్కిల్ యూనివర్సిటీ బోర్డు డైరెక్టర్‌గా నియమించుకున్నామని అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News