రాహుల్ గాంధీని లక్షం చేసుకుంటూ అధికార ఎన్‌డిఎకు చెందిన నేతలు ఇటీవల చేసిన ప్రకటనలపై కాంగ్రెస్ పార్టీ బుధవారం పోలీస్ ఫిర్యాదు దాఖలు చేసింది. రాహుల్ గాంధీ భద్రతకు ముప్పు తేవడం, జమ్మూ కాశ్మీర్, హర్యానాలలో ఎన్నికల దృష్టా ప్రశాంతతకు భంగం కలిగించడం వారి లక్షమని కాంగ్రెస్ ఆరోపించింది. ఎఐసిసి కోశాధికారి, ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఒకు అందజేసిన ఫిర్యాదులో బిజెపి నేతలు తార్విందర్ సింగ్ మార్వాహ్, రవ్నీత్ సింగ్ బిట్టు, రఘురాజ్ సింగ్, శివసేన ఎంఎల్‌ఎ సంజయ్ గైక్వాడ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మాకెన్ అభ్యర్థించారు. ఫిర్యాదు దాఖలు చేసిన అనంతరం మాకెన్ విలేకరులతో మాట్లాడుతూ, ‘దివంగత ఇందిరా గాంధీ, దివంగత రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారన్నది మన అందరికీ తెలుసు. ఆ తరువాత కూడా వారు అటువంటి బెదరింపులు చేస్తూనే ఉన్నారు’ అని చెప్పారు.
భారత్‌లో రాజకీయాలు ఇంత కన్నా హీన స్థితికి దిగజారవని ఆయన అన్నారు. ఒక్క బిజెపి నేతే కాదని, అనేక మంది నేతలు అటువంటి మాటలు అన్నారని, కానీ బిజెపి ఎటువంటి చర్యా తీసుకోలేదని మాకెన్ ఆరోపించారు. ‘రాహుల్ గాంధీ ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, ఆదివాసీ, మైనారిటీ ప్రజల గురించి మాట్లాడుతుంటారు. అందుకే బిజెపి వారికి ఆయన మాటలు గిట్టడం లేదు. వారు ఆయనను బెదరించడానికి ఇదే కారణం’ అని ఆయన పేర్కొన్నారు. ‘అయితే ఒక విషయం చెబుతాను ఇది కాంగ్రెస్ పార్టీ, మేము బెదరబోవడం లేదు, తగ్గడం లేదు’ అని మాకెన్ స్పష్టం చేశారు. ‘ఈ నెల 11న ఒక బిజెపి కార్యక్రమంలో మార్వాహ్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హత్యకు బెదరించారు. ‘మీ ప్రవర్తన మెరుగుపడాలి లేకపోతే మీ నాయనమ్మకు పట్టిన గతే మీకు పడుతుంది’ అని ఆయన అన్నారు’ అని పోలీస్ ఫిర్యాదులో మాకెన్ తెలియజేశారు. ప్రతిపక్ష నాయకుని నాలుకను తెగ్గోసేవారు ఎవరికైనా రూ. 11 లక్షల బహుమతి ఇస్తానన్న సేన ఎంఎల్‌ఎ గైక్వాడ్ ప్రకటనను కూడా ఆయన ఉటంకించారు.
ప్రతిపక్ష నాయకుడు ‘దేశంలో నంబర్ 1 ఉగ్రవాది’ అన్న రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ బిట్టు వ్యాఖ్యలను మాకెన్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ‘చేశారు. హింసాకాండను ప్రజ్వరిల్లచేయడం, శాంతిని భగ్నం చేయడం లక్షంగా రాహుల్‌పై ప్రజల్లో విద్వేషాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తించేందుకు బిట్టు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రకటన చేశారు. సదరు ప్రకటనను టివి చానెళ్లలోను, సామాజిక మాధ్యమాల్లోను బాగా ప్రచారం చేశారు’ అని ఫిర్యాదు పేర్కొన్నది. రాహుల్ గాంధీ ‘భారత్‌లో నంబర్ వన్ ఉగ్రవాది’ అన్న ఉత్తర ప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ వ్యాఖ్యలను కూడా ఫిర్యాదు ప్రస్తావించింది. ‘రాహుల్ గాంధీని హత్య చేయాలని లేదా గాయపరచాలని పిలుపు ఇస్తూ, దేశ ప్రతిపక్ష నాయకుని ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ వివిధ బిజెపి నేతలు, దాని మిత్ర పక్షాల నేతలు జారీ చేసిన పై ప్రకటనలు/ బెదరింపులు రాహుల్ పట్ల బిజెపి/ ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలకు గల వ్యక్తిగత ద్వేషాన్ని ప్రతిబింబిస్తున్నాయి’ అని ఫిర్యాదు పేర్కొన్నది.
విద్వేషపూరిత వ్యాఖ్యల ద్వారా అల్లర్లకు ప్రేరేపించడానికి, శాంతిని భగ్నం చేయడానికి సాధారణ ప్రజానీకంలో అశాంతిని రేపడం లక్షంగా అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొన్నది. సమాజంలోని మహిళలు, యువజనులు, దళితులు, ఇతర అణగారిన వర్గాలకు సంబంధించిన అంశాలను, అటువంటి ప్రజా ప్రాధాన్య సమస్యల పరిష్కారంలో బిజెపి వైఫల్యాన్ని రాహుల్ పదే పదే ప్రస్తావిస్తున్నారని కాంగ్రెస్ తెలియజేసింది. అయితే, అది బిజెపికి, దాని మిత్ర పక్షాలకు మింగుడుపడలేదని, అందుకే పైన పేర్కొన్న వ్యక్తులను దేశ ప్రతిపక్ష నేతపై అటువంటి ‘విద్వేషపూర్తి’ వ్యాఖ్యలు చేసేందుకు నియోగించారని కాంగ్రెస్ ఆరోపించింది. ‘బిఎన్‌ఎస్ 2023లోని సంబంధిత నిబంధనల కింద ఒక ఎఫ్‌ఐఆర్‌ను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ప్రధానం’ అని కాంగ్రెస్ అన్నది.