Saturday, January 11, 2025

ఆ 27 స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్!

- Advertisement -
- Advertisement -

స్ట్రాటజీ టీమ్‌లు రంగంలోకి…

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల వేళ అన్ని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా ఏ పార్టీని రెండు సార్లు గెలిపించని రాష్ట్రంలోని ఆ 27 నియోజకవర్గాలపై కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2009, 2018లో ఈ స్థానాల్లో సిట్టింగ్‌లను ఓటర్లు మారుస్తూ వస్తున్నారు. అక్కడ ఈ సారి ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటర్లు షాక్ ఇస్తూ వస్తున్నారు. 2009 నుంచి వస్తున్న ఈ ట్రెండ్ ఈసారి తమకు అనుకూలంగా మలుచుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఇప్పటికే ఈ 27 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తమ స్ట్రాటజీ టీమ్‌లను రంగంలోకి దించింది. ఈ 27 సెగ్మెంట్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలు ఉండడం విశేషం.

ఈ మూడు స్థానాలను ఎలాగైనా గెలవాలని…

ఎన్నికల్లో గెలిచి కచ్చితంగా అధికారంలోకి రావాలంటే ఈ స్థానాలు కీలకమని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ 27 స్థానాల్లో కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో కొత్తగూడెం, ములుగు, తాండూరు నియోజకవర్గాలను గెలుచుకుంది. ఈ సారి కొత్తగూడెం టికెట్‌ను కాంగ్రెస్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు కేటాయించింది. ఇక, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సారి ఈ మూడు స్థానాలను ఎలాగైనా తిరిగి గెలిచి నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ఖమ్మం, అశ్వారావు పేట, వైరా, కొత్తగూడెం…

ఆ 27 నియోజకవర్గాలకు సంబంధించి హైదరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, ముషీరాబాద్, ఉప్పల్, శేరిలింగంపల్లిలో వరుసగా రెండు సార్లు ఏ పార్టీ గెలవలేదు. ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట, వైరా, ఖమ్మం, కొత్తగూడెంలలో సైతం 2009, 20014లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓటర్లు మార్చారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి, మక్తల్, నల్గొండ జిల్లాలో దేవరకొండ, కరీంనగర్ జిల్లాలో రామగుండం, జగిత్యాల, వరంగల్ జిల్లాలో ములుగు, డొర్నకల్, నర్సంపేట, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, తాండూర్, పరిగిలతో వరుసగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఓటర్లు ఓడిస్తున్నారు. సరిగా ఇదే ట్రెండ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వర్క్ అవుట్ అవుతుందని టి కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగానే ఇక్కడ స్ట్రాటజీ టీమ్‌లను రంగంలోకి దించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News