మనతెలంగాణ/ హైదరాబాద్: రానున్న శాసనసభ ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా సామాజిక వర్గాలకు టికెట్లు కేటాయింపుపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ ప్రతి లోక్ సభ స్థానంలో రెండు అసెంబ్లీ టికెట్లను బిసిలకు కేటాయించాలని సూచించారు. ఈ లెక్కన 34 సీట్లు బిసి సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉంటుంది. 31 రిజర్వుడ్ సెగ్మెంట్లున్నాయి. వాటిలో ఎస్‌సి 19, ఎస్‌టి 12 నియోజకవర్గాలు. మొత్తం 65 సెగ్మెంట్లను పార్టీ బిసి, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాల్సి వస్తుంది.
కాగా ఏడు సెగ్మెంట్లలో మజ్లిస్ బలంగా ఉంది. ఇవి పోను మిగిలినవి 46 స్థానాలు మాత్రమే. పార్టీలోని బలమైన సామాజిక వర్గం ఈ 46 సీట్లలోనే తమ స్థానాలను వెతుక్కోవాల్సి వస్తుంది. తాజాగా అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించే కార్యక్రమానికి పిసిసి శ్రీకారం చుట్టింది. ఈ నెల 25 వరకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా ప్రకటించింది. ఇందులో బిసిల నుంచి ఎన్ని దరఖాస్తులు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.