Wednesday, January 22, 2025

తెలంగాణలో సెటిలర్స్‌పై క్రాంగ్రెస్ ఫోకస్..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది  ప్రధాన  రాజకీయ పార్టీలు వారి వారి అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెటిలర్స్ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో సెటిలర్స్‌ విషయంలో విమర్శలు చేసిన కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారం చేపట్టాక తన వైఖరి మార్చుకున్నారు. సెటిలర్స్‌పై సానుకూల వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే రాజకీయ కారణాల నేపథ్యంలో కేసీఆర్.. తన రూట్ మార్చారనే విమర్శలు కూడా లేకపోలేదు.

ఎందుకంటే.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మొత్తం 119 స్థానాల్లో 63 చోట్ల మాత్రమే గెలుపొందింది. అయితే సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు గులాబీ పార్టీకి వ్యతిరేక తీర్పు వచ్చింది. సెటిలర్స్ ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో టీడీపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు ఆంధ్రతో సరిహద్దు పంచుకుంటున్న ఖమ్మంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక పవనాలే వీచాయి. ఆ తర్వాత నుంచే కేసీఆర్..సెటిలర్స్‌ను తమవైపు తిప్పుకోవడంపై దృష్టి సారించారు.

ఈ క్రమంలోనే సెటిలర్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన నేతలను.. గులాబీ గూటికి చేర్చుకున్నారు. సెటిలర్స్‌కు తమవైపుకు తిప్పుకోవడానికి అభివృద్ది అజెండాను ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే 2016లో  జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం అందుకుంది. అప్పటి నుంచి సెటిలర్స్‌ను బీఆర్ఎస్ పార్టీ వారి ఓటు బ్యాంకుగా మార్చుకుంది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సెటిలర్స్‌ను బీఆర్ఎస్ వైపుకు ఆకర్షించేలా కేసీఆర్ ప్రసంగాలు చేశారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నవారంతా తెలంగాణ బిడ్డలేనని చెప్పారు. హైదరాబాద్ విశ్వ నగరం.. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు.. సర్వ కులాలు, సర్వ ప్రజలు నివాసం ఉన్న నగరం అని కూడా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కొందరు సెటిలర్స్‌కు కూడా కేసీఆర్ టికెట్లు ఇచ్చారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్- టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో కేసీఆర్ మరోసారి సెంటిమెంట్‌ను రగిలించారు. చంద్రబాబు అనవసరం విద్వేషాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. ఈ వ్యుహం ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సత్ఫలితాలే ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్.. 87 చోట్ల విజయం సాధించింది. ఒక్క ఉమ్మడి  ఖమ్మం జిల్లా తప్ప.. మిగిలిన అన్ని చోట్ల భారీగా సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ తర్వాత టీడీపీ నుంచి గెలిచిన  ఇద్దరు, కాంగ్రెస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీఆర్ఎస్‌కు మరింత బలం చేకూరినట్టయింది.

ఇక, ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణ ప్రజానీకాన్ని తన వెంట ఉంచుకోవడంతో హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా సెటిలర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో గులాబీ పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై ఆంధ్ర సెటిలర్స్‌లో  ఓ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఏపీలో నెలకొన్న పరిస్థితులే కారణంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌కు కేసీఆర్ సపోర్ట్ అందించడం, ఏపీలో అభివృద్ది, అక్కడ వారి ఆస్తుల రక్షణ.. ఇలా పలు రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని ఓ వర్గం బీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్నారనే బలమైన ప్రచారం సాగుతుంది.

అయితే దీనిని క్యాష్ చేసుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు కూడా వేగంగా పావులు కదుపుతున్నాయి. కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత వేగంగా ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్ కూడా.. సెటిలర్స్ ఓటు బ్యాంకుపై దృష్టి సారించింది. రానున్న ఎన్నికల్లో సెటిలర్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా  ప్రాంతాల్లో సెటిలర్స్‌తో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు సినీ ఇండస్ట్రీలోని కార్మికులు కూడా ఎక్కువగా ఆంధ్ర ప్రాంతానికే చెందిన వారు కావడం.. వీరు చాలా ఏళ్లుగా నగరంలోని కృష్ణా నగర్, తదితర ప్రాంతాల్లో సెటిల్ అయిన సంగతి  తెలిసిందే. సినీ కార్మికుల సమస్యల పరిష్కారంపై స్పష్టమైన వైఖరిని తీసుకోవడంతో పాటు.. గతంలో సినీ పరిశ్రమ అభివృద్ది కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించే ప్రయత్నం కూడా జరుగుతుంది.

అంతేకాకుండా సెటిలర్స్‌ను ఓటు బ్యాంకు మాదిరిగా చూస్తూన్నామనే భావన రాకుండా.. వారికి అధికారంలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచన కూడా చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సినీ పరిశ్రమ నుంచి గానీ, సెటిలర్స్ నుంచి గానీ మంత్రివర్గంలో చోటు కల్పిస్తామనే ఫీలర్స్ కూడా పంపుతుంది. మరి ఈ ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలంటే.. మరో 5 నెలలు వేచిచూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News