Tuesday, September 17, 2024

ఆ 25 నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఫోకస్

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి 5 జిల్లాలపై పట్టుకోసం అధిష్టానం బెట్టు
ఇప్పటికే ఆ జిల్లాలకు చేరుకున్న
స్ట్రాటజిస్టు టీమ్‌లు

మనతెలంగాణ/హైదరాబాద్: అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహారిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని ఆ 25 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉన్నట్లు గుర్తించింది. ఆ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. దీంతో ఏఐసిసి ఆదేశాల మేరకు ఆ 25 నియోజకవర్గాల్లో స్ట్రాటజిస్టుల టీమ్ లు రంగంలోకి దిగాయి. ఉమ్మడి 5 జిల్లాలైన (వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు) ఈ టీమ్‌లు చేరుకున్నాయి. పోలింగ్ డే వరకు ఆ స్ట్రాటజిస్టు టీమ్‌లు నియోజకవర్గాల్లోనే పనిచేయనున్నాయి. పార్టీ విజయానికి అవసరమైన సలహాలు, సూచనలు ఈ టీమ్‌లు అందించనున్నాయి. స్థానికంగా ఉండే సోషల్ మీడియా, టిపిసిసి, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ శ్రేణులతో కలిసి ఈ టాస్క్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. స్ట్రాటజిస్టులు తమ మెదళ్లకు పదును పెట్టి రాబోయే మూడు వారాల పాటు క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన పనులను పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు అందజేయనున్నారు. ఈ 25 నియోజకవర్గాల అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా ఏం మాట్లాడాలి? ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి? ఏయే అంశాలను హైలైట్ చేయాలి? వంటి అంశాలను కూడా స్ట్రాటజిస్టులు ఎప్పటికప్పుడు అభ్యర్థులకు దిశా నిర్ధేశం చేయనున్నారు.
ఇంటి నుంచి పొలింగ్ కేంద్రం లోపలికి వెళ్లే వరకు …
సుమారు 25 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. దీంతో తుది దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమయ్యింది. ప్రధానంగా పొల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ పెట్టింది. గ్రౌండ్ నుంచి ప్రతి కార్యకర్తపై బాధ్యతను పెంచేలా వ్యూహాలను అమలు చేస్తోంది. ప్రతి వ్యక్తి ఇంటి నుంచి పొలింగ్ కేంద్రం లోపలికి వెళ్లే వరకు కార్యకర్తలు వాళ్లతోనే ఉండేలా వారిని సమాయత్తం చేయనుంది. హస్తం గుర్తుకే ఓటు వేసేలా ఓటర్ మైండ్‌ను ఫిక్స్ చేసేందుకు కాంగ్రెస్ టీమ్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.
ఆరు గ్యారెంటీలు ఎక్కువమందికి చేరేలా…
మొదటి దశ గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఇప్పటికే పార్టీ విజయవంతంగా పూర్తి చేసింది. టఫ్ ఫైట్ ఉన్న 25 నియోజకవర్గాల్లో ఆరు గ్యారెంటీలు వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మరోసారి వివరించేందుకు పార్టీ సిద్ధమైంది. దీంతో పాటు ఏఐసిసి అగ్రనేతలు, టిపిసిసి నేతలు ఇదే నియోజకవర్గాల్లో మరింత ఎక్కువగా తిరగాలని పార్టీ ప్లాన్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News