బిసిల సమస్యలపై ఆర్.కృష్ణయ్యతో చర్చలు
తెలంగాణా పిసిసి ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే
హైదరాబాద్: బలహీనవర్గాల హక్కుల సాధన, సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలంగాణ పిసిసి ఇంఛార్జి , ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మాణిక్ రావు తాక్రే సృష్టం చేశారు. బిసిల డిమాండ్లు, హక్కులకు సంబందించిన అంశాల్లో ఆర్ . కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీవీ ఒకే రకమైన ఆలోచనలని చెప్పారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపి ఆర్ . కృష్ణయ్యతో శనివారం సాయంత్రం విద్యానగర్‌లోని బిసి భవన్‌లో మాణిక్ రావు భేటీ అయ్యారు. మాజీ ఎంపి వి. హనుమంతరావు సహా పలువురు కాంగ్రెస్ నేతలతో బిసి భవన్‌కు వచ్చిన అయన వివిధ బిసి సంఘాల ప్రతినిదులతో కలిసి బలహీన వర్గాల సమస్యలపై చర్చించారు.
అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాణిక్ రావు మాట్లాడుతు తెలంగాణలో 50 శాతానికి మించి మంచి బీసీలు ఉన్నారని, దేశవ్యాప్తంగా. ఓబీసీలది మెజారిటీ సంఖ్య అని చెప్పారు. అయితే ప్రాంతాల వారిగా ఓబిసిల సమస్యలు ఉన్నాయని, వాటిపై చర్చించి భవిష్యత్ కార్యచరణ రూపొందించేందుకే సమావేశమయ్యాయని తెలిపారు. జనగణనలో భాగంగా కుల గణన జరగాలని, జనాభా కు అనుగుణంగానే నిదులు కేటాయించాలనేది తమ పార్టీ విధానమన్నారు. ఓబిసిలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను రాహుల్ గాందీ దృష్టికి తీసుకు వెళ్ళి, వాటి పరిష్కారం కోసం ఆవసరమైన పధకాలను పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేరుస్తామన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక తరహాలనే ఎన్నికల్లో గెలిచిన వెంటనే తెలంగాణలోను బిసిలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు. తెలంగాణలోని బిసిల హక్కులు కాపాడి ఆకాంక్షలు నేరవేరుస్తామని అదే సమయంలో బడుగులందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలన్నారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతు బిసిల డిమాండ్ల పరిష్కారమే ఏకైక లక్ష్యమని, కులగణన చేసి 50 శాతం సీట్లు బడుగులకు ఇవ్వాలని కాంగ్రెస్ ను కోరారు.