తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల వివాదం ముదురుతోంది. సేవ్ కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ సీనియర్లు పోరుబాట పట్టారు. వలస నేతలకు కమిటీల్లో స్థానం కల్పించారని కాంగ్రెస్ సీనియర్లు ఆరోపిస్తున్నారు. అయితే సీనియర్లకు మాజీ ఎంఎల్‌ఎ ఎరవత్రి అనిల్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని బలహీనపర్చేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈనెల 26 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని నిర్ణయిస్తే, పాదయాత్రను దెబ్బతీయాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లు ముసుగులో ఉన్న వారు ఇప్పుడు బయటకు వచ్చారన్నారు. 12 మంది ఎంఎల్‌ఎలు పార్టీని వీడినప్పుడు సేవ్ కాంగ్రెస్ ఎందుకు గుర్తురాలేదని అనిల్ సీనియర్లను ప్రశ్నించారు. అప్పుడు పిసిసిగా ఉన్నవాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముసుగు వీరుడని విమర్శించారు.
మునుగోడులో ఎవరెవరు ఎంత లబ్ధి పొందారో తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఉత్తమ్ గత ఎన్నికల్లో ఎవరెవరికి ఎంత డబ్బులిచ్చారో తెలుసన్నారు. కాంగ్రెస్ డబ్బులపై లెక్కలు అడుగుతారనే నారాయణరెడ్డిని బిజెపిలోకి పంపారని విమర్శించారు. కౌశిక్‌రెడ్డికి ఉత్తమ్ ఎన్ని కోట్లు ఇచ్చారో అందరికీ తెలుసన్నారు. కౌశిక్‌రెడ్డిని టిఆర్‌ఎస్‌లోకి పంపించి ఎంఎల్‌సి చేయించారని ఉత్తమ్ పై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో కోవర్టుగా పనిచేసినందుకే టిఆర్‌ఎస్‌లో కౌశిక్‌రెడ్డికి ఎంఎల్‌సి పదవి దక్కిందన్నారు. సీనియర్ల కుట్రలతోనే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ముసుగువీరుల కుట్రలకు సామాన్య కార్యకర్తలు బలికావొద్దన్నారు.