Monday, December 23, 2024

పౌరులకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

- Advertisement -
- Advertisement -

అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి ఘటన వెనుక కాంగ్రెస్ పార్టీయేనా: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పౌరులకు భద్రత, భరోసా ఇవ్వడంలోనూ, వారికి రక్షణ కల్పించడంలోనూ పాలకుల అసమర్థత ప్రతిఫలిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం సినీ హీరో అల్లు అర్జున్ నివాసం వద్ద రాళ్లు విసిరి, పూలకుండీలు ధ్వంసం చేసిన ఘటనపై కిషన్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

అల్లు అర్జున్ నివాసంపై దాడి ఘటనకు కారకుల వెనుక కాంగ్రెస్ పార్టీయే ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి ఇదే నిదర్శనమని ఆ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. హైదరాబాదులో అల్లు అర్జున్ నివాసంపై విద్యార్థి సంఘాల నేతలు రాళ్ల దాడికి పాల్పడడం దారుణమని ఆయన ఖండించారు. ఈ రాళ్ల దాడి ఘటన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో శాంతిభద్రతలు దిగ్భ్రాంతికర రీతిలో క్షీణించాయన్న వాస్తవాన్ని ఎత్తిచూపుతోందని పేర్కొన్నారు.

నటులను, చిత్రపరిశ్రమను టార్గెట్ చేయడం అనేది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కనిపిస్తున్న ప్రమాదకర ధోరణిగా కిషన్ రెడ్డి పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ నివాసంపై దాడి వెనకున్నది కాంగ్రెస్ పార్టీయేనా? ఇది కాంగ్రెస్ ప్రోత్సాహంతో జరిగిన దాడేనా? అని సందేహం వెలిబుచ్చారు. ఈ మేరకు దాడి వీడియోను కూడా కిషన్ రెడ్డి తల ట్వీట్‌లో విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News