సిద్ధరామయ్య చేత సిఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్, ఉప ముఖ్యమంత్రిగా డికె శివకుమార్ ప్రమాణం, కేబినెట్ మంత్రులుగా మరో ఎనిమిది మంది, ఖర్గే కుమారుడికి మంత్రివర్గంలో స్థానం, హాజరైన రాహుల్, ప్రియాంక, ఏడు రాష్ట్రాల సిఎంలు, పలువురు విపక్ష నేతలు , ప్రతిపక్షాల బల నిరూపణకు కేంద్రంగా మారిన వేదిక , సిద్ధరామయ్య, డికెలకు ప్రధాని అభినందనలు
బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణం చేయడం ఇది రెండో సారి. ఉపముఖ్యమంత్రిగా డికె శివకుమార్‌చేత ప్రమాణం చేయించారు. కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ వీరిచేత ప్రమాణం చేయించారు. బెంగళూరులో ని కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు పెద్ద సంఖ్యల లో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్, ప్రియాంకగాంధీలకు శివకుమార్ స్వయంగా స్వాగతం పలికికారు. దగ్గరుండి వారికి వేదిక వద్దకు తీసుకు వచ్చారు.
మరో 8 మంది మంత్రులు కూడా..
సిఎం, డిప్యూటీ సిఎంతో పాటుగా మరో ఎనిమిది మంది క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి జి పరమేశ్వర, కెహెచ్ మునియప్ప, కెజె జార్జి, ఎంబి పాటిల్, సతీశ్ జార్కిహోళి, మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బి జడ్ జమీర్ అహ్మద్ ఖాన్ చేత గవర్నర్ గెహ్లోత్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. అన్ని వర్గాల వారికి సమాన ప్రా తినిధ్యం లభించేలా క్యాబినెట్‌లో మంత్రిపదవులు కేటాయించినట్లు కాంగ్రెస్ తెలిపింది.
సిఎంలు, మాజీ సిఎంలు హాజరు
కాగా కర్నాకలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పలు భావస్వామ్య పార్టీల నేతలను ఆహ్వానించడంతో ఇది కాం గ్రెస్, ప్రతిపక్షాల బలప్రదర్శనకు వేదికగా మారింది. 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా పలు విపక్షాల నేత లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లోట్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాఘెల్, హిమాచల్ ప్రదేశ్ సిఎం సుఖ్విందర్ సింగ్ సుక్కుతో పాటుగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, బీహార్ సిఎం నితీశ్ కుమా ర్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా తదితర నేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన వారిలో ఉన్నారు.
ప్రధాని శుభాకాంక్షలు
కర్నాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య, డికె శివకుమార్‌లకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సిద్ధరామయ్యజీ, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన డికె శివకుమార్‌జీలకు అభినందనలు. ఫలప్రదమైన పదవీకాలం కోసం నా శుభాకాంక్షలు’ అని ప్రధాని ట్వీట్ చేశారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధరామయ్య ను అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.