తెలంగాణలో బిజెపి పని అయిపోయింది
బిజెపి అభ్యర్థులకు డిపాజిట్లు రావు
మనతెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి రెండు నియోజకవర్గాల్లో గెలుస్తారని, ఈ నెల 30వ తేదీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, డిసెంబర్ 3వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య అన్నారు. ఈ సందర్భంగా బిసి డిక్లరేషన్‌ను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి సిద్ధరామయ్య విడుదల చేశారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రజా గర్జన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి పని అయిపోయిందని, బిజెపి అభ్యర్థులకు డిపాజిట్లు రావని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రధాని మోడీ వందసార్లు వచ్చినా, తెలంగాణలో ప్రచారం చేసినా, బిజెపి గెలిచే అవకాశం లేదన్నారు. తెలంగాణలో బిజెపి నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కువ అని సెటైర్ వేశారు. బిజెపి ప్రధాని మోడీని నమ్ముకొని ఈ ఎన్నికలకు వెళ్తుందని, కానీ కర్ణాటకలో ప్రధాని మోడీ 48 చోట్ల సభలు నిర్వహిస్తే ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించిందన్నారు. మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతారని, ఇటీవల హైదరాబాద్ లో జరిగిన బిజెపి బిసి ఆత్మగౌరవ సభలో కూడా ఆయన అబద్ధాలే చెప్పారన్నారు. మోడీలా అబద్ధాలు మాట్లాడే ప్రధానిని ఇంతవరకు చూడలేదని ఆయన ధ్వజమెత్తారు.
5 గ్యారంటీల అమలును చూడాలంటే కర్ణాటకకు రండి…
ఎవరైనా 5 గ్యారెంటీలను చూడడానికి కర్ణాటక రావాలని, కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రచారానికి ప్రధాని మోడీ 48 సార్లు వచ్చారని అయినా బిజెపి కర్ణాటకలో గెలవలేక పోయిందని సిఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. అప్పుడు మోడీ ఎక్కడ ప్రచారం చేశారో అక్కడే కాంగ్రెస్‌కు ఎక్కువ మెజారిటీ వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో మోడీని నమ్ముకున్న కర్ణాటక బిజెపి నేతలు ఆ తర్వాత తలపట్టుకున్నారన్నారు. ప్రధాని మోడీ పచ్చి అబద్ధాల కోరు అని, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ చాలా అవకాశాలు ఇచ్చిందని ఆయన చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను అమలు చేయలేమని బిజెపి ఆరోపించిందని, కానీ, వారం రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసి చూపించామన్నారు.