Thursday, December 19, 2024

ఆరునూరైనా.. ఆరు గ్యారంటీలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకురావాలనే కృత నిశ్చయంతో ప్రజా ప్రభుత్వం సాహసోపేతంగా ముందుకెళ్తుందని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర శాసనసభలో శనివారం 2024 -25 ఆర్థిక సంవత్సరానికి మంత్రి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.2,75,891 కోట్లతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లు, మూలధన వ్యయం 29,669 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలనే నిరంకుశ విధానం నుంచి ‘అందరి కోసం మనమందరం’ అనే నూతన స్పూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క శాసనసభలో, ఐటి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనసమండలిలో 2024- 25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ పద్దును ప్రవేశపెట్టారు.

ఆర్ధికమంత్రిగా తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క గత బిఆర్‌ఎస్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాల్లో తీవ్రమైన లోపాలున్నాయని దుయ్యబట్టారు. ఆ లోపాలను సవరించి సమూలంగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని శాసనససభ వేదికగా ప్రకటించారు. నీటిపారుదల రంగంలో గత బిఆర్‌ఎస్ సర్కార్ సాధించింది ఏమీ లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. పదేళ్లలో అనుసరించిన ఒంటెద్దు పోకడలు, సాగునీటి రంగాన్ని, ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖకు 28 వేల 24 కోట్ల రూపాయలు కేటాయించామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరిచ్చే ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని భట్టి ప్రకటించారు. రాష్ట్ర ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకురావాలనే కృత నిశ్చయంతో ప్రజా ప్రభుత్వం సాహసోపేతంగా ముందుకెళ్తుందని విక్రమార్క తెలిపారు. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రంలోనూ ఆర్థిక కష్టాలు వచ్చాయని, కానీ తమ ప్రభుత్వ లక్ష్యం సంతులిత వృద్ధి అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ఆర్భాటాలు, ఆకర్షణలకు దూరంగా తమ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. మార్పును కోరుతూ స్వేచ్ఛను సాధించుకున్న తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మార్పణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పదేళ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో తెలంగాణ చూస్తోందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నిస్సహాయులకు సహా యం చేయడమే తమ లక్ష్యమని వివరించారు.
ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చామని భట్టి పేర్కొన్నారు. నిర్బంధాలు, నియంతృత్వ ధోరణులు ఉండవని చెప్పామని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలు ప్రకటించామని, బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి సంతకం చేయడం తమ ప్రభుత్వ సంకల్పానికి, చిత్తశుద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. నూతన ప్రభుత్వం తొలి అడుగులోనే సంక్షేమానికి నాంది పలికిందని వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ కోసం రూ.35,752 కోట్లు ఖర్చు చేసినట్లు గత ప్రభుత్వం చెప్పిందని.. వేల కోట్లు ఖర్చు చేసినా నేటికీ సురక్షిత నీరు లేని గ్రామాలెన్నో ఉన్నాయని అన్నారు.

ఈ పథకం లోపాల దిద్దుబాటుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఎక్కువ దూరం నుంచి తాగునీటిని తీసుకోవడం వ్యయప్రయాసలకు గురి చేస్తోందని ఈ విధానాన్ని మారుస్తామని అన్నారు. త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ ‘రైతుబంధు’తో అనర్హులే ఎక్కువగా లాభం పొందారని, వీటి నిబంధనలను పునఃసమీక్ష చేస్తామని తెలిపారు. రైతుబంధు పేరిట పెట్టుబడిదారులు, స్థిరాస్తి వ్యాపారులకే ఎక్కువ లబ్ధి జరిగిందని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఈ పథకంలో సమూల మార్పులు తెచ్చి అర్హులకే రైతు భరోసా అందిస్తామని తేల్చి చెప్పారు. ఫసల్ భీమా అమలు చేస్తామని చెప్పారు.అర్హులైన రైతులకు రైతుభరోసా కింద ఎకరానికి రూ.15,000 ఇస్తామని ప్రకటించారు. కౌలు రైతులకు రైతుభరోసా ఇచ్చేందుకు మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు భట్టి వెల్లడించారు.

ప్రతి మండలానికి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు
రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సకాలంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలతో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఉన్నత విద్యామండలి సంపూర్ణ ప్రక్షాళనకు కృషి చేస్తామని తెలిపారు. అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
నీటి పారుదల రంగంలో తప్పిదాలు ప్రగతికి అవరోధాలుగా మారాయి
నీటి పారుదల రంగంలో తప్పిదాలు ప్రగతికి అవరోధాలుగా మారామని మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నిపుణుల సలహాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం.. శాపంగా మారిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణకు కార్యాచరణ ప్రకటించామని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పేరిట పేదలను నయవంచనకు గురి చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజల ఆశలను రాజకీయ అవసరాలకు వాడుకుని లబ్ధి పొందారని చురకలంటించారు. ఇందిరమ్మ ఇండ్ల కింద పేదలకు రూ.5 లక్షలు ఇస్తామని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సమర్థంగా వాడుకుంటామని భరోసానిచ్చారు.

యువతను రెచ్చగొట్టకుండా అక్కున చేర్చుకుంటాం
గత ప్రభుత్వం మాదిరిగా యువతను రెచ్చగొట్టకుండా అక్కున చేర్చుకుంటామన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనులతో నవతరం ఆత్మస్థైర్యం దెబ్బతిందని విమర్శించారు. వారి భవిష్యత్తుకు తాము గ్యారెంటీ ఇచ్చినందుకే, రాష్ట్రంలోని యువత తమ వెంట నిలిచిందన్నారు. ఈ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరింత బాధ్యతగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. యువజన సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని చెప్పారు.స్వేచ్ఛాయుత తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికే ఏర్పాట్లు చేస్తామన్నారు. యువతే దేశానికి భవిష్యత్తు అంటూ కూనిరాగాలు తీయటం కాదని, చిత్తశుద్ధితో వారి మెరుగైన జీవతానికి బాటలు వేస్తామని హామీ ఇచ్చారు.

నిరుద్యోగులు ఆత్మగౌరవంతో బతికే ఏర్పాటు
రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ అతి త్వరలో పూర్తి చేసి, నియామకపత్రాలు ఇవ్వబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే నోటిఫికేషన్‌లో చేర్చినవి కాకుండా అదనంగా 64 గ్రూప్- 1 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా నియామకం చేయకుండా నిరుద్యోగుల జీవతాలతో చెలగాటం ఆడిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ యువత ఆకాంక్షలను తీర్చేలా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ సరైన దారిలో పెట్టటమే కాకుండా నిరుద్యోగ యువత ఆకాంక్షలను నెరవేర్చే విధంగా పనిచేయడానికి ప్రక్షాళన చేస్తామని అన్నారు. ఇందుకోసం నిర్వహణ ఖర్చు నిమిత్తం అవసరమైన రూ.40 కోట్ల ఆర్థిక వనరులను, అదనపు సిబ్బందిని ఇప్పటికే మంజూరు చేసినట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మగౌరవంతో బతికే ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాబ్ క్యాలెండర్‌తో ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పారు. త్వరలోనే మెగా డిఎస్‌సిని ప్రకటిస్తామన్నారు.

ఆరు గ్యారెంటీల అమలుకే పెద్ద పీట
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల అమలుకే పెద్ద పీట వేసింది. ప్రత్యేకించి ఆరు హామీలకు పద్దులో ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం రూ.53,196 కోట్లను రాష్ట్ర సర్కార్ కేటాయించింది. అందులో మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, యువ వికాసం పథకం, చేయూత పథకాలు ఉన్నాయి. అందులో రెండు హామీలను ఇప్పటికే అమలు చేసిన ప్రభుత్వం, మరో రెండింటిని త్వరలోనే అమలు చేయనుంది. అన్ని గ్యారంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని సర్కార్ తెలిపింది. దీంతో వీటి అమలుకు బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. అర్హులైన అందరికీ ఆరు గ్యారంటీలు అందుతాయని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్‌టిసికి ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం రూ.2,418 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని వివరించారు.

ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు..
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇస్తామని మంత్రి భట్టి తెలిపారు. స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం చేస్తామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించనున్నట్లు చెప్పారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, త్వరలోనే అన్నదాతలకు రూ.2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ చేపడుతామని పేర్కొన్నారు. మూసీ నదిని, నదీ తీరాన్ని ఒక పర్యావరణ హిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఉద్ఘాటించారు. ఇందులో భాగంగా పాదచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, పాత నగరంలోని హెరిటేజ్ జోన్లు, హాకర్స్ జోన్లు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్‌టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఈ పథకంలో భాగంగా అమలు చేస్తామని వెల్లడించారు.

దీనికి కావాల్సిన నిధుల్లో ఎక్కువ శాతం నది చుట్టు ఉన్న భూములను వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చి సమకూరుస్తామని చెప్పారు. హైదరాబాద్ మెడలో అందమైన హారంగా మూసీ నదిని తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.40 వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయని భట్టి వెల్లడించారు. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి రెండు లెదర్ పార్కులు, రాష్ట్రం నలుమూలలా ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. డ్రైపోర్టులను అందుబాటులోకి తెచ్చేందుకు బృహత్ ప్రణాళిక రచిస్తున్నామన్నారు. ఐటీని రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News