Monday, December 23, 2024

సన్నాలకు ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

ఈసారి నుంచి సన్న రకం వరిసాగును పెంచేలా
రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహాం
మార్కెట్‌లో పెరిగిన సన్నరకాల డిమాండ్
భారీగా పెరిగిన ధరలు
రెండేళ్లుగా దొడ్డు బియ్యం సాగుకు గత ప్రభుత్వం ప్రోత్సాహాం

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంతో పాటు రాష్ట్రంలోనూ భారీ మొత్తంలో దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రతి సీజన్‌లోనూ రాష్ట్రంలోని రైతులు పెద్ద మొత్తంలో దొడ్డు రకం వడ్లను సాగు చేస్తున్నారు. దీంతో వాటి నిల్వలు పెరిగిపోతుండగా, అటు సన్న రకాలకు కొరత ఏర్పడుతోంది. మార్కెట్లో సన్న బియ్యం రేట్లు వినియోగదారులకు అందనంతగా పెరిగిపోతున్నాయి. దీంతోపాటు గడిచిన రెండేళ్లలో దొడ్డు బియ్యం సాగు భారీగా పెరిగిపోయి సన్న ధాన్యాల సాగు గణనీయంగా తగ్గిపోయిందని వ్యవసాయ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దీంతోపాటు మార్కెట్‌లో సన్న రకాల డిమాండ్, వినియోగం ఎక్కువగా ఉంది. అందుకే రేటు కూడా ఎక్కువ. ఈ నేపథ్యంలోనే సన్న రకాల వరి సాగు పెరిగేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పలు పథకాలకు సన్న బియ్యం సరఫరా
మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తోంది. రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తోంది. ఏటా ఖరీఫ్, రబీ రెండు పంట సీజన్‌లోనూ కస్టమ్ మిల్లింగ్ చేయించిన బియ్యాన్ని రాష్ట్రంలో ప్రజాపంపిణీ అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తోంది. ఒకవైపు రైతుల నుంచి సేకరించిన దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోతుంటే సన్న బియ్యం కోటా మన రాష్ట్ర పంపిణీ అవసరాలకు కూడా సరిపోవటం లేదు.

ప్రజా పంపిణీకి ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం
రేషన్ షాపుల ద్వారా (రాష్ట్ర ప్రభుత్వ కార్డులు, జాతీయ ఆహార భద్రత కార్డుల కింద) ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరం. అంటే సుమారుగా 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సమానం. దొడ్డు బియ్యం తినేందుకు రేషన్ కార్డుదారులు ఇష్టపడటం లేదు. చాలా చోట్ల వీటిని అమ్ముకుంటున్నారు. అందుకే సన్నాల సాగు పెరిగితే రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా కూడా ఈ బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర సివిల్ సప్లయ్ విభాగం మిల్లింగ్ చేయిస్తున్న వాటిలో దొడ్డు బియ్యం 98 శాతం ఉండగా సన్న బియ్యం ఒకటి, రెండు శాతం మించి ఉండటం లేదు. మారిన అవసరాలకు అనుగుణంగా రైతులు దొడ్డు రకాలకు బదులు సన్నరకాల వరి సాగుపై దృష్టి సారిస్తే ఈ పరిస్థితిని అధిగమించే వీలుందని ప్రభుత్వం భావిస్తోంది.

తగ్గిన సన్నధాన్యాల దిగుబడి
దొడ్డు రకంతో పోలిస్తే సన్న ధాన్యాల దిగుబడి కొంత తగ్గుతుంది. అందుకే రైతులు దొడ్డు రకం ధాన్యం ఎక్కువగా సాగు చేస్తున్నారు. కానీ, సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వటం ద్వారా రైతులకు వచ్చే దిగుబడి నష్టాన్ని పూడ్చే వీలుంది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 2019, -20లో రాష్ట్రంలో 91.45 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వడ్ల దిగుబడి ఉండగా. 86.79 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం దిగుబడి వచ్చింది. 2020, -21 లో 125.51 లక్షల మెట్రిక్ టన్నుల సన్న దాన్యం, 93.01 లక్షల దొడ్డు ధాన్యం, 2021-,22లో 105.90 లక్షల మెట్రిక్ టన్నులు సన్నవి, 96.26 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం దిగుబడి వచ్చింది. ‘2022,-23లో 178.46 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం, కేవలం 79.74 లక్షల సన్న ధాన్యం, 2023-,24లో 174.18 లక్షల దొడ్డు ధాన్యం, 86.26 లక్షల సన్న ధాన్యం దిగుబడి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News