Monday, December 23, 2024

10 వర్సిటీలకు ఇంఛార్జ్ విసిల నియామకం

- Advertisement -
- Advertisement -

ఉస్మానియా యూనివర్సిటీకి దాన కిశోర్
జెఎన్‌టియుహెచ్‌కు బుర్ర వెంకటేశ్‌కు బాధ్యతలు అప్పగింత
కాకతీయ వర్సిటీకి వాకాటి కరుణ..మహాత్మాగాంధీకి నవీన్ మిట్టల్
ఇంఛార్జ్ విసిలుగా సీనియర్ ఐఎఎస్ అధికారుల నియామకం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇంఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్లుగా సీనియర్ ఐఎఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత విసిల పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. 2021 మే 22న పది వర్సిటీలకు గత ప్రభుత్వం వైస్ ఛాన్స్‌లర్లను నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, జెఎన్‌టియుహెచ్, శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగు యూనివర్సిటీ, జవహర్‌లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్ వర్సిటీల విసిల పదవీ కాలం మంగళవారం ముగియడంతో సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంఛార్జ్ విసిలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జూన్ 15 వరకు ఇంఛార్జ్ విసిలు కొనసాగనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉస్మానియా యూనివర్సిటీకి దాన కిశోర్, జెఎన్‌టియుహెచ్ బాధ్యతలను బుర్ర వెంకటేశ్‌కు అప్పగించింది. కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జ్ విసిగా వాకాటి కరుణ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి ఎస్‌ఎఎం రిజ్వి, తెలంగాణ వర్సిటీకి సందీప్ సుల్తానియా, తెలుగు యూనివర్సిటీకి విసిగా శైలజ రామయ్యర్ నియమితులయ్యారు. అలాగే మహాత్మా గాంధీ వర్సిటీకి నవీన్ మిట్టల్, శాతవాహన వర్సిటీకి సురేంద్ర మోహన్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్ వర్సిటీకి జయేశ్ రంజన్, పాలమూరు వర్సిటీ ఇంఛార్జ్ విసిగా నదీం అహ్మద్‌ను నియమించింది.

జూన్ 15 లోపే కొత్త విసిలు
పది యూనివర్సిటీలకు నియమితులైన కొత్త విసిలు వచ్చే నెల 15 వరకు కొనసాగనున్నారు. ఆ లోపే వైస్ ఛాన్స్‌లర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్ల నియామక ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలు త్వరలోనే సమావేశాలు నిర్వహించనున్నారు. విసి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి బయోడేటాలను సెర్చ్ కమిటీలు పరిశీలించి, వైస్ ఛాన్స్‌లర్‌గా నియామకానికి మూడూ పేర్లు సూచిస్తాయి.

విసిలుగా నియమితులు కావాలంటే కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలి. లేదా పరిశోధన, అకడమిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పదేళ్ల అనుభవం ఉండాలి. ఉపకులపతులను మూడేళ్ల కాలపరిమితికి నియమిస్తారు. సాధ్యమైనంత త్వరగా సెర్చ్ కమిటీ సమావేశాలు నిర్వహించి, విసిల ఎంపికకు సిఫార్సులు అందించనున్నాయి. సెర్చ్ కమిటీల సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఆయా వర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్లను నియమించనున్నది.

ఇంచార్జ్ విసిలుగా నియమితులైన ఐఏఎస్ అధికారులు

ఉస్మానియా యూనివర్సిటీ- దాన కిషోర్
జెఎన్‌టియుహెచ్- బుర్ర వెంకటేశం
కాకతీయ యూనివర్సిటీ- కరుణ వాకాటి
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ- రిజ్వి
తెలంగాణ యూనివర్సిటీ- సందీప్ సుల్తానియా
తెలుగు యూనివర్సిటీ- శైలజ రామయ్యర్
మహాత్మా గాంధీ యూనివర్సిటీ- నవీన్ మిట్టల్
శాతవాహన యూనివర్సిటీ- సురేంద్రమోహన్
జెఎన్‌ఎఎఫ్‌ఎయు- జయేష్ రంజన్
పాలమూరు యూనివర్సిటీ- నదీం అహ్మద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News