న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రస్తుతం ఎటువంటి ముప్పు లేదని, ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటుందని పార్టీ వర్గాలు సోమవారం నాడిక్కడ తెలిపాయి. రాష్ట్ర విక్రమాదిత్య సింగ్ ఎఐసిసి నాయకత్వంతో మాట్లాడారని కూడా వారు చెప్పారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూపైన, ఆయన ఇప్పటివరకు సాగించిన పనితీరుపైన కాంగ్రెస్ నాయకత్వానికి నమ్మకం ఉందని వారు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వం మార్పు జరిగే అవకాశం లేదని వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వానికి మెజారిటీ ఉందని, ఐదేళ్ల పూర్తి కాలం హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సేవలందచేస్తుందని వారు చెప్పారు. ధన బలంతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని చేసే ప్రయత్నాలు ఫలించబోవని వారు స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం ద్వారా ఆయారాం, గయారాం ఎత్తుగడలను కట్టడి చేయగలిగామని వారు తెలిపారు. అటువంటి రాజకీయాలను హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఇష్టపడరని కూడా వారు వివరించారు. పారీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం వల్ల సభలో మిగిలిన సభ్యులు 62 మందికి చేరారని,ప్రభుత్వానికి మెజారిటీ సంఖ్య 32 కన్నా అధిక మద్దతే ఉందని వారు వివరించారు. ప్రభుత్వంపై బిజెపి, తిరుగుబాటు ఎమ్మెల్యేలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు క్షమాపణలు చెబుతున్నారని, తమపైన అనర్హత వేటు ఉపసంహరించాలని పరోక్షంగా వేడుకుంటున్నారని వర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు, రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు ప్రతిభా సింగ్‌కు కుమారుడైన విక్రమాదిత్య సింగ్ ఎఐసిసి నాయకులతో మాట్లాడి తన అభిప్రాయాలను తెలియచేశారని వారు చెప్పారు.
గత మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఏకైక రాజ్యసభ సీటుకు జరిగిన ఎన్నికల్లో కేవలం 25 మంది ఎమ్మెల్యేలతో మైనారిటీలో ఉన్న బిజెపి అభ్యర్థి గెలుపొందడం సంచలనం సృష్టించింది. కాంగ్రెస్‌కు మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బిజెపికి అనుకూలంగా ఓటు వేశారు. ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలను స్పీకర్ కుల్దీప్ సింగ్ పలథానియా గత గురువారం అనర్హులుగా ప్రకటించారు. బుధవారం తన రాజీనామాను ప్రకటించిన మంత్రి విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ పరిశీలకులతో భేటీ అనంతరం తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు.