కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తమ ఫిర్యాదులు, నివేదనలను సాక్ష్యాధారాలతో నోటరీ ద్వారా ప్రమాణ పూర్వక అఫిడవిట్ రూపంలో సీల్డ్ కవర్లలో పంపించాలని ఈ మేరకు గురువారం రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ప్రకటన విడుదల చేశారు. అన్ని పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ‘8వ అంతస్తు, డి బ్లాక్, బిఆర్కే భవనం, సచివాలయం వద్ద, హైదరాబాద్- 500063’ వద్ద ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయాలని సూచించారు.
మే 31 లోగా ప్రజలను తమ అఫిడవిట్లను నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ పైన పేర్కొన్న చిరునామాకు పంపవచ్చని వెల్లడించారు. తగిన సాక్ష్యాధారాలు లేని, నోటరీ ద్వారా పొందిన ప్రమాణ పత్రం లేని అఫిడవిట్ తిరస్కరించబడతాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసిందని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నిర్మాణపరమైన లోపాలు, నాణ్యతా, నిర్వహణ లోపాలను వెలికి తీయడం, వాటికి బాధ్యులను గుర్తించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం వంటి తదితర సంబంధిత అంశాలపై ఈ కమిషన్ విచారణ చేపడుతుందని రాహుల్ బొజ్జా సదరు ప్రకటనలో వెల్లడించారు.