Tuesday, September 17, 2024

వాతావరణ శాఖ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించినా రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు…ఎలాంటి ముందు జాగ్రత్తలు లేవు..స్థానిక ప్రజలకు హెచ్చరికలూ లేవు అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు – ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు…మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సిఎం లేనట్టు పక్క రాష్ట్రపు సిఎంకు ఫోన్ చేస్తాడు, మూడో మంత్రి ఫోటోలకు పోజులకే పరిమితమవుతాడు అని ఘాటుగా విమర్శించారు. జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే చీప్ మినిస్టర్ ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిఎం రేవంత్ రెడ్డి తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్ రావు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు పట్ల మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సిఎం స్థాయిని దిగజార్చి, విపత్తును కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దుఃఖంలో ఉన్న ప్రజలకు భరోసాను కల్పించాల్సిన సిఎం మళ్లీ అవే ఊకదంపుడు మాటలు మాట్లాడిండు అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చూసి ప్రజలు అసహ్యించు కుంటున్నారని అన్నారు. తాను చీఫ్ మినిస్టర్ కాదు… చీప్ మినిస్టర్ అని మరోసారి నిరూపించుకున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాల మీద నిందలు వేస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకున్నారని చెప్పారు.

పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్షాలను సైతం లెక్క చేయకుండా ప్రజల మధ్య తిరుగుతుంటే, సిఎం రేవంత్ మాత్రం హైదరాబాద్‌లో ఫిడేల్ వాయించారని ఎద్దేవా చేశారు. వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే, ప్రాణాలు కోల్పోతుంటే ఆలస్యంగా మొద్దు నిద్ర లేచి ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి ప్రతిపక్షాల మీద పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు. ఇంతకంటే దారుణం, దౌర్భాగ్యం మరొకటి ఉండదు రేవంత్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాజకీయాలు పక్కనపెట్టి ఆపత్కాలంలో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా మాట్లాడు… సహాయక చర్యలు చేపట్టి ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందని దైర్యం ఇవ్వు అని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News