Sunday, December 22, 2024

పెండింగ్ సాదాబైనామాలకు త్వరలోనే మోక్షం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కొత్త చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలపడంతో పెండింగ్ సాదాబైనామాలకు త్వరలోనే మోక్షం కలుగనుంది. జూన్ 2, 2014 నాటికి తెల్లకాగితాలపై ఒప్పందాల (సాదాబైనామా) ద్వారా జరిగిన కొనుగోళ్లను క్రమబద్ధీకరించాలని ఆర్‌ఓఆర్ -2024 చట్టం సెక్షన్ 6(1) కింద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డీఓ స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత వాటిని క్రమబద్ధీకరణ చేయనున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం సాదాబైనామా రూపంలో భూములు కొని అనుభవిస్తున్నా సరైన పత్రాలు లేకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం వారిని రైతులుగా గుర్తించడం లేదు.

అయితే వీటిని క్రమబద్ధీకరించడం కోసం గత ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించినా వాటిని పరిష్కరించటంలో విఫలమైంది. తాజాగా ప్రస్తుత ప్రభుత్వం కొత్త ఆర్‌ఓఆర్ చట్టం ద్వారా సాదాబైనామాలకు భూ హక్కులు వర్తింపజేస్తామని వెల్లడించడంతో దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వమే సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 2వ తేదీ 2014లో లిఖితపూర్వక ఒప్పందంతో భూములు కొన్న రైతుల దరఖాస్తులకు చట్టబద్ధత కల్పించి పాసుపుస్తకాలు జారీచేయాలని ప్రభుత్వం ఈ కొత్త చట్టంలో పేర్కొంది. నాలుగేళ్ల క్రితం ప్రభుత్వానికి 8.90 లక్షల దరఖాస్తులు రాగా సుమారుగా 20 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

2016 సంవత్సరంలో 11.19 లక్షల దరఖాస్తులు
2014 జూన్ రెండో తేదీకి ముందు సాదాబై నామా పద్ధతిలో జరిగిన కొనుగోళ్లను అధికారికంగా గుర్తించేందుకు 2016లో క్రమబద్ధీకరణ ప్రక్రియను మొదటగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ సమయంలో 11.19 లక్షల దరఖాస్తులు రాగా 6.18 లక్షల మంది భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అనంతరం మరోమారు అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు ఇవ్వడంతో రెండోదఫా ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో అవకాశం కల్పించింది.

2 లక్షల ఎకరాలకు పైగా భూముల క్రమబద్ధీకరణ
2016లో ప్రభుత్వం మొదటగా ప్రకటించిన సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 11.19 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో నిబంధనల మేరకు ఉన్న 6.18 లక్షల దరఖాస్తులకు సంబంధించి 2 లక్షల ఎకరాలకు పైగా భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనల ప్రకారం లేని 4.19 లక్షల దరఖాస్తులను తిరస్కరించింది. తాజాగా 2020 అక్టోబర్ 12వ తేదీన చివరివిడతగా క్రమబద్దీకరణ పథకాన్ని మళ్లీ ప్రభుత్వం ప్రకటించింది. అదే నెల 29వ తేదీని చివరి గడువుగా పేర్కొన్నప్పటికీ ఆ తరువాత నవంబర్ 10వ తేదీ వరకు పొడిగింపునిచ్చింది. సాదా బైనామాలకు ఆర్‌ఓఆర్ చట్టం 197 ప్రకారం రూల్ 1989లోని రూల్ 22 ప్రకారం ఫారం 10లో దరఖాస్తు చేసుకున్న వారికి 13 బి ధ్రువీకరణ పత్రంతో చట్టబద్ధత కల్పించాలని అప్పటి ప్రభుత్వం ధరణి చట్టంలో సూచించింది.

భూ- భారతిలో ప్రత్యేక ఆప్షన్
అప్పటి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి నాలుగేళ్లు దాటినా ఇప్పటివరకు వాటికి పరిష్కారం లభించలేదు. తాజాగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సాదాబైనామా భూములు ఉన్న రైతులకు భూహక్కులు లభించే అవకాశం ఉంది. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణలో తలెత్తుతున్న అడ్డుంకులను తొలగించటంతో పాటు వీటి పరిష్కారానికి భూ- భారతిలో ప్రత్యేక ఆప్షన్ తీసుకువస్తే మార్గం సులువుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం లిఖితపూర్వక ఒప్పందం ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతుల పేర్లు రికార్డుల్లో లేకపోవటంతో వారు భూహక్కుదారులుగా గుర్తింపు పొందలేకపోయారు.

సాదాబైనామా పత్రాలు చట్టపరంగా ధ్రువీకరించినవి కావు. దీంతో సదరు భూమి మీదు తమ హక్కులను రుజువు చేసుకోవటం రైతులకు కష్టంగా మారింది. సాదాబైనామా భూములపై పూర్వపు కాలం యజమానులు లేదా వారి వారసులు తమకు హక్కులు ఉన్నట్లు కోర్టుల కేసులు వేస్తే వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. భూ క్రయ, విక్రయాలకు చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. పట్టా లేకపోవటం వల్ల బ్యాంకు లోన్లు, రాయితీలు అందటం లేదు. భూమి అసలు యజమాని ఎవరో తెలియడం కష్టంగా ఉండడంతో సదరు భూములు హక్కుల కోసం వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం సాదాబైనామాల క్రమబద్ధీకరణతో ఈ సమస్యలు అన్నింటికీ పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News