రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక మిషన్
19 ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో పనుల్లో వేగం
సంబంధిత అధికారులతో సిఎం నెలకోసారి సమీక్ష
నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి చేయాలని సిఎం ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంది. స్పీడ్ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) పేరుతో సరికొత్త కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులు, పనులను ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షిస్తున్నారు. సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సమావేశమవుతారు. ఈ పనులను నిర్ణీత వ్యవధిలో సమర్ధవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
‘స్పీడ్’ నిర్ధేశించిన ప్రణాళికకు అనుగుణంగా పనులు చేపట్టాలని సంబంధిత విభాగాల అధికారులను సిఎం ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రామాణికమైన మౌలిక సదుపాయాల కల్పనలో వివిధ విభాగాల మధ్య ఉన్న అడ్డంకులు, అవరోధాలను అధిగమించేందుకు స్పీడ్ ప్రత్యేక చొరవ ప్రదర్శిస్తుంది. ఆలస్యం జరగకుండా నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. పట్టణాలకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి పనులపై స్పీడ్ దృష్టి కేంద్రీకరిస్తుంది.
పనుల పురోగతిపై ఆన్‌లైన్ పోర్టల్ నిర్వహణ
ఈ స్పీడ్ కార్యక్రమంలో భాగంగా తమ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు, పనులపై సంబంధిత విభాగాలు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తాయి. ఏ గడువులోగా ఎంత పని జరుగుతుందన్న నిర్ణీత కాల వ్యవధిని ఇందులో పొందుపరుస్తారు. ఎప్పటివరకు ఏయే పనులు పూర్తవుతాయే పనుల అంచనాలను ప్రస్తావిస్తారు. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఆయా విభాగాలు ప్రత్యేక విధానం అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రమం తప్పకుండా పనితీరును సమీక్షించుకొని పర్యవేక్షణకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రణాళిక విభాగం ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్‌ను నిర్వహిస్తుంది. ఏ రోజుకు ఎంత పని జరిగిందన్న అప్‌డేట్ డేటాను ఇందులో పొందుపరుస్తుంది.
స్పీడ్ ప్రోగ్రాంలోని 19 ప్రాజెక్టులు ఇలా..
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, శాటిలైట్ టౌన్‌ల అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, జీహెచ్‌ఎంసి పునర్వ్యవస్థీకరణ, రీజనల్ రింగ్‌రోడ్డు, హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, మహిళా శక్తి పథకం అమలు, జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం, రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి, ఐటీఐల్లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు, కొత్త ఉస్మానియా హాస్పిటల్, 15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారా మెడికల్ కాలేజీలు, హెల్త్ టూరిజం ప్రమోషన్ ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్, టెంపుల్ సర్క్యూట్స్ టూరిజం, యాంటీ డ్రగ్స్ స్ట్రాటజీ అమలు తదితర ప్రాజెక్టులు ఉన్నాయి.