Thursday, January 23, 2025

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలను అవమానించే అధికారం లేదు: మురళీధర్‌ రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం పట్ల బిజెపి మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మురళీధర్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను అవమానించే అధికారం ఎవ్వరికీ లేదని, కాంగ్రెస్ పార్టీ అహంకారం ప్రదర్శించడంతో ప్రజలు ఓడించారని, విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్ 3న తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని వెంటనే చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని, దేశ చరిత్రను కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మజ్లీస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని, సోనియా, రాహుల్, ప్రియాంక ముగ్గురు గాంధీలు తెలంగాణలో ప్రచారం చేస్తున్నారని ఈఎన్నికల్లో కుటుంబ రాజకీయాలను అంతమొందించాలని సూచించారు. సామాజిక తెలంగాణ చేయగల ఏకైక పార్టీ బిజెపి మాత్రమనేని, రాష్ట్రంలో కాంగ్రెస్, మజ్లీస్ కలిసి నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. పహాడ్ షరీఫ్‌లో కేవలం ముస్లింలకు మాత్రమే ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నారని, అక్కడ హిందువులు లేరా? అని ప్రశ్నించారు.

ఓటు బ్యాంకు రాజకీయాలు దేశ భద్రతకు చిల్లులు పొడుస్తోందని, తెలంగాణ సమాజం ఆలోచించి ఓటు వేయాలన్నారు. మన ముఖ్యమంత్రులను అవమానించిన కాంగ్రెస్ పార్టీ అహంకారానికి ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్పారన్నారు. గతంలో తెలంగాణ పోరాటాన్ని అణచివేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా? ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది తామేనని ఎలా అంటారని నిలదీశారు. ‘క్వీన్ ఎలిజబెత్, క్లిమెంట్ ఎట్లీ పెట్టిన బిక్షనే భారత్‌కు స్వాతంత్య్రం’ అనగలమా? దశాబ్దాల పోరాటం, సకలజనుల పోరాట ఫలితంగా తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు.

ప్రచారానికి జాతీయ నాయకులు వచ్చి పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడితే గట్టిగా బదులివ్వాల్సి ఉంటుందని, తెలంగాణ సోనియా బిక్ష అసలే కాదు… సకల జనుల పోరాటం, అమరుల త్యాగాలతో వచ్చిందన్నారు. నిజాం నవాబు ఇస్తే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని ఎంఐఎం అన్నట్లు వీరి మాటలు ఉన్నాయని… కుటుంబాల గుత్తాధిపత్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News