బిఆర్‌ఎస్ నాయకులు,హోం మంత్రి మహమూద్ అలీ
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో గంగా జమున తెహజీబ్ కొనసాగుతున్నదని బిఆర్‌ఎస్ నాయకులు,హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. 50 ఏండ్లుగా ముస్లింలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. సిఎం కెసిఆర్ పాలనలో సెక్యూలర్ తెలంగాణ కొనసాగుతున్నదని వ్యాఖ్యానించారు. ముస్లిం బిడ్డల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పేద ముస్లిం ఆడబిడ్డలకు షాదీ ముబారక్ ఒక వరమని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మైనార్టీ నేతలతో కలిసి మంత్రి మహమూద్ అలీ మీడియాతో మాట్లాడారు.
పేద విద్యార్థులకు విదేశీ విద్య అందిస్తున్నామని చెప్పారు. 3 వేల మంది విద్యార్థుల విదేశీ విద్యకు సహాయం చేశామని తెలిపారు. మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్ ఇస్తున్నామన్నారు. ముస్లింలలో వృత్తిదారులకు రూ.లక్ష మైనార్టీ బంధు సాయం అందిస్తున్నామని వెల్లడించారు. మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి రూ.2,200 కోట్ల బడ్జెట్ కేటాయించామని చెప్పారు. ఇది కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల కంటే అనేక రెట్లు ఎక్కువ బడ్జెట్ అని పేర్కొన్నారు. అన్ని సంక్షేమ పథకాలు మైనార్టీలకు అందుతున్నాయని తెలిపారు. కులం, మతం చూడకుండా అన్నివర్గాలకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు. అన్ని మతాల పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. బిఆర్‌ఎస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని, కెసిఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని మహమూద్ అలీ అన్నారు.
Mahmood Ali | 50 ఏండ్లలో ముస్లింలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు: : మంత్రి మహమూద్ అలీhttps://t.co/wwW8DFFp37
— Namasthe Telangana (@ntdailyonline) November 28, 2023