మంచిర్యాల్: కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల్ లో భారీ ర్యాలీ జరిగింది. సోమవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధి నాయకత్వం ఆదేశాల మేరకు మంచిర్యాలలో ఎఐసిసి సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు రాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి సైకిళ్లు, ఎడ్ల బండ్లతో పురవీధుల గుండా నిరసన ప్రదర్శన జరిపారు. ప్రేమ్ సాగర్రావు నివాసం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ బెల్లంపల్లి చౌరస్తా, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, శ్రీనివాస టాకీస్, ఐబి చౌరస్తా మీదుగా బెల్లంపెల్లి చౌరస్తా వరకు చేరుకుంది. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం బెల్లంపల్లి చౌరస్తాలో కార్యకర్తలనుద్దేశించి ప్రేమ్సాగర్ రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను అదుపు చేయడంలో విఫలమైందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా సామాన్యులకు ఆర్థిక వెసులుబాటు కల్పించినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ పెట్రోల్, డీజీల్ ధరలు మాత్రం పెంచుకుంటూ పోతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తప్పకుండా తగ్గిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ.. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్యులపై పెను భారం పడుతోందని అన్నారు. ధరలు విపరీతంగా పెరగడం వల్ల కుటుంబంపై ఆర్థిక భారం పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పేద ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ధర లను పెంచి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆమె ధ్వజమెత్తారు. నిరసన ర్యాలీకి పరిశీలకుడిగా వచ్చిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. మంచిర్యాల జిల్లాలో ప్రేమ్సాగర్ రావు రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కొనియాడారు.
Congress held cycle rally against fuel prices in Mancherial