పిసిసి చీఫ్‌కు హుజూరాబాద్ ‘చిచ్చు’, 13న ఢిల్లీకి రావాల్సిందిగా రేవంత్ ఇతర ముఖ్యనేతలకు ఆదేశం
మన తెలంగాణ/ హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్‌లను సైతం దక్కించుకోలేని స్థితిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ప్రభావం టిపిసిసిపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేని సీనియర్లు కాంగ్రెస్ హైకమాండ్‌కు మొరపెట్టుకున్నారు. దీంతో ఘోర పరాజయానికి కారకులైన నేతలపై కాంగ్రెస్ అధిష్టానం కన్నెర్రజేసింది. అందులో భాగంగానే ఢిల్లీకి రావాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌తో సహా ముఖ్య నేతలను పిలవడం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 64వేల ఓట్లు సొంతం చేసుకోగా.. తాజా ఎన్నికల్లో 3014 ఓట్లకు మాత్రమే దిగజారడం గమనార్హం. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు పేలవంగా రావడంపై ఇటు టిపిసిసిలోని సీనియ ర్లు ఆజ్యం రగల్చగా.. అటు హైకమాండ్ సైతం మరీ ఇంత అధ్వాన్నంగా పనితీరు కనబర్చారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ముప్పెటదాడిలో టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి విలవిలలాడుతున్నారు.
ఒక ప్రత్యేక పరిస్థితుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహణ జరిగిందని.. ఇంతకు మించిన ఫలితం ఊహించలేమని భావిస్తున్నప్పటికీ పార్టీ ఉనికిని కోల్పోయే రీతిలో ఫలితం రావడంపైనే హైకమాం డ్ దృష్టి సారించింది. టిపిసిసి చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకమైనప్పట్నించీ కొందరు సీనియర్లు ఆయనపై గుర్రు గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, రేవంత్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పట్నించీ దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీలో నూతనోత్తేజాన్ని నింపేందుకు శాయశక్తులా తన వంతు ప్రయత్నాలు చేస్తుండటంతో సోకాల్డ్ సీనియర్లు కాస్తంత మౌనం వహించారనే చెప్పాలి. అయితే ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం సదరు సీనియర్లకు అందివచ్చిన అవకాశంగా చెబుతున్నారు. అంతే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం దారుణంగా పడిపోవడంపై కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఓటమిపై సమీక్ష నిర్వహించాలని హైకమాండ్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కాగా, హూజూరాబాద్ ఉప ఎన్నికలో పూర్తి ఓటమికి తాను బాధ్యత వహిస్తానని రేవంత్ ప్రకటించా రు. మరోవైపు పార్టీలో సీనియర్లకు స్వేచ్ఛ ఎక్కువని, అంద ర్నీ కలుపుకుపోతానని పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇవేవీ రుచించని కొంద రు సీనియర్లు యధాతధంగా తమ పంథాను కొనసాగి స్తూ రాజకీయ వ్యవహారాల కమిటీలో సైతం ధిక్కార స్వరం వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్ ఓటమిపై ఒక్క రేవంత్‌పైనే బాధ్యత మోపడం తగదని సీనియ ర్ నేత జానారెడ్డి వంటి నేతల వ్యాఖ్యలను సైతం కొంద రు సీనియర్ నేతలు పట్టించుకోకపోవడం ఈ సందర్భం గా గమనార్హం. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారా ల ఇంఛార్జి మాణికం ఠాగూర్ చేసిన హితబోధలను సైతం వారు పట్టించుకున్న దాఖలాలు లేవని చెబుతున్నారు. పైపెచ్చు మాణికం ఠాగూర్ వ్యవహారశైలిపైనా హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిన ఘటనలు లేకపోలేదని చెబుతున్నా రు. ఠాగూర్ వచ్చిన తర్వాత ఏ ఎన్నికల్లోనూ పార్టీ విజ యం సాధించడం లేదంటూ హైకమాండ్‌కు కొందరు సీనియర్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే లేపాయని చెబుతున్నారు.
పార్టీలో అనైక్యత, విభేదాలు తారాస్థాయి కి చేరడమే ఈ పరిస్థితులకు ఒకింత కారణమని చెప్పేవా రు లేకపోలేదు. మరోవైపు రేవంత్‌ను వదులుకోలేక.. అటు సీనియర్లను బుజ్జగించలేక కాంగ్రెస్ హైకమాండ్ పరిస్థితి అటు నుయ్యి.. ఇటు గొయ్యి అన్న చందాన తయారైంది. ఈ పరిస్థితుల్లో వీటన్నింటికీ స్వస్తి చెప్పేందుకు పరిస్థితిని ఒక కొలిక్కి తెచ్చే దిశగా హైకమాండ్ నడుం బిగించినట్లు సమాచారం. కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నికలో అధ్వా న్న ఫలితం రావడంపై మాత్రం మరోవైపు హైకమాండ్ సైతం ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 13న ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ హైకమాండ్ హజూ రాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపై సమీక్ష నిర్వహించనుం ది. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్, టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు సిఎల్పీ లీడర్ మల్లు భట్టివిక్రమార్క, ఎఐసిసి కార్యదర్శి హాజరు కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఇదే క్రమంలో అటు ఓటమిపై సమీక్ష.. రేవంత్‌కు సహకారం.. సీనియర్లను దారికి తెచ్చుకోవడం, పార్టీలో క్రమశిక్షణను బలోపేతం చేయ డం వంటి ఇత్యాది అంశాలను సైతం హైకమాండ్ చర్చించనున్నట్లు సమాచారం. హైకమాండ్ ఏ విధంగా టిపిసిసిని గాడిలో పెడుతుందో.. చూడాలి..!