హైదరాబాద్: ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలించారు. వీడియో చూసి ఆయన ఓ అభిప్రాయానికి వచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం ఉదయం తనను కలవాలని కోమటిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తారో లేదో కానీ ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా చాలా ఫిర్యాదులు వెళ్లాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తి స్థాయిలో కోవర్టుగా పని చేస్తున్నారని ఆయనను నమ్మడం వల్ల పార్టీ మునుగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు.
కొంత మంది నేతలు బహిరంగంగానే కోమటిరెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా కూడా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగినా ఆయన పాల్గొనలేదు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో ఆస్ట్రేలియా వెళ్లిన ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవదని ప్రకటించారు. ఆ వీడియో వైరల్ అయింది. దీంతో ఆయనకు రెండు సార్లు కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే అది తన వీడియో కాదని మార్ఫింగ్ చేశారని కోమటిరెడ్డి షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆ సమాధానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త ఇంచార్జ్ గా మాణిక్ రావ్ థాక్రే వచ్చిన తర్వాత గాంధీ భ వన్‌కు కూడా వచ్చారు.
రేవంత్ తో కూడా సమావేశంయ్యారు. దీంతో సమస్య పరిష్కారం అయిందని, ఇక కోమటిరెడ్డి సర్దుకుపోతారని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ పిలుపునిచ్చిన హాత్ సే హాత్ జోడోయాత్రను కోమటిరెడ్డి ప్రారంభించలేదు. హఠాత్తుగా ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలవలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే బిజెపిలో ఉన్నారు. తరచూ బిజెపి అగ్రనేతల్ని కోమటిరెడ్డి కలుస్తున్నారు. వివాదాస్పద కామెంట్లు చేస్తున్నారు.
ఇదంతా కావాలనే చేస్తున్నారని, పార్టీలో ఉంటూ, పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని ఇతర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఆ పార్టీలో ఎక్కువగా వినిపిస్తోంది. బిఆర్‌ఎస్‌తో పొత్తు విషయమై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెర తీశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ముక్తకంఠంతో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతమేనని కొట్టిపారేస్తున్నారు. పార్టీ శ్రేణులను గందరగోళానికి గురి చేసే వ్యాఖ్యలు చేయొద్దని మండిపడుతున్నారు. కొంత ఆలోచించి మాట్లాడాలని హితవు పలుకున్నారు.