Sunday, December 22, 2024

వెంకటిరెడ్డిపై వేటు?

- Advertisement -
- Advertisement -

తలకు చుట్టుకున్న మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారం
తన సోదరుడు, బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేయడంతో అధిష్ఠానం సీరియస్
కోమటిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎఐసిసికి పిసిసి నివేదిక
కాంగ్రెస్ అభ్యర్థి ఘోర పరాజయానికి వెంకట్‌రెడ్డే కారణమని ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్: ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై వేటు వేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో ఆయన వ్యవహారం కల్లోలం సృష్టిస్తోంది. ఒకరిద్దరు నేతలు మినహా ఆయన తీరును రాష్ట్ర పార్టీ నేతలంతా వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో వెంకట్ రెడ్డి వ్యవహారం మరింత మచ్చ తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ రాకుండా ఓడిపోవడంలో వెంకట్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై వేటు వేసేందుకు ఎఐసిసి ముందు పిసిసి కీలక అంశాలను నివేదిక రూపంలో ముందు పెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలంటూ చెప్పిన ఆడియో తనది కాదని, అది పాత వీడియో అంటూ పలు రకాలుగా తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తుండటంతో వాటన్నింటిపైనా సమగ్రంగా విశ్లేషిస్తూ ఎఐసిసికి రిపోర్ట్ పంపించినట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఓ మండల లీడర్‌కు వెంకట్ రెడ్డి ఫోన్ చేసి, బిజెపి నుంచి పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ చెప్పిన ఆడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఎఐసిసి కూడా స్పందించి, ఏకంగా షోకాజ్ నోటీసు జారీ చేసింది.

అయితే, సదరు మండల నేత ఈ ఆడియో పాతదని చెప్పగా, ఎఐసిసికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇచ్చిన సమాధానంలో తన వాయిస్ కాదంటూ చెప్పినట్లు తెలుస్తోంది. కానీ, ఈ అంశంపై పిసిసి కీలకమైన వివరాలను ఎఐసిసికి పంపించినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఉప ఎన్నిక సమయంలోనే వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు ఫోన్లు చేసి, బిజెపికి మద్దతు ఇవ్వాలని చెప్పారని, దానిలో చాలా కీలకమైన అంశాలున్నాయని పిసిసి నుంచి ఎఐసిసికి వివరించారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచే పోటీ చేశారని, కానీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడిన ఆడియోలో ‘ఏ పార్టీ నుంచి పోటీ చేసినా రాజగోపాల్ రెడ్డి మనోడు అని, ఆయనకు సపోర్టు చేయాలంటూ ఎందుకు అనాల్సి వచ్చిందనే అంశాలను వివరించారు. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నిక తర్వాత పిసిసి చీఫ్ రేవంత్‌ను తొలిగిస్తారని, తనకే పిసిసి ఇస్తారని స్పష్టంగా చెప్పారని, దీంతో ఈ ఆడియో ఈ ఉప ఎన్నిక సందర్భంగా మాట్లాడిందేనని పిసిసి నుంచి ఎఐసిసికి స్పష్టత ఇచ్చినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.

దాదాపు ఏడాదిన్నర నుంచి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆయన్ను ఒక దశలో పార్టీలోనే నేతలే ‘కోవర్టు రెడ్డి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి స్రవంతితో పాటుగా చాలామంది నేతలు కూడా వెంకట్‌రెడ్డి బిజెపి కోసం పని చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ వర్గం గట్టిగా వాదిస్తోంది. గతంలో వెంకట్ రెడ్డికి సపోర్ట్ చేసిన వాళ్లు కూడా ఇప్పుడు ఆయన విషయంలో మౌనం వహిస్తున్నారు. ఇదే సమయంలో ఎఐసిసి నుంచి కూడా షోకాజ్ రావడంతో మరింత స్వరం పెంచుతున్నారు. ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి కొంత అనుకూలంగా ఉన్నారని పార్టీ వర్గాల్లో టాక్. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఖర్గే తనకు రేవంత్ మంచి మిత్రుడని, తన సెగ్మెంట్, రేవంత్ సెగ్మెంట్ పక్క పక్కనే ఉండటంతో సన్నిహిత సంబంధాలున్నాయని సైతం వ్యాఖ్యానించారు.

ఇప్పుడు వెంకట్ రెడ్డి విషయంలో రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని, పార్టీలో వ్యతిరేకవర్గానికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఖర్గే ద్వారా వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకునే అంశంపై పట్టుపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెంకట్ రెడ్డి కూడా తనపై వచ్చిన ఆరోపణలు సమర్ధించుకునే ప్రయత్నాలు చేస్తున్నా అనుకూలంగా రావడం లేదని అంచనా వేస్తున్నారు. దీంతో ఆయనపై త్వరలోనే వేటు వేస్తారని పార్టీ వర్గాలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.

Congress High Command Serious on Komatireddy Venkatreddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News