Saturday, October 5, 2024

మంత్రి సురేఖపై హైకమాండ్ సీరియస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పేదల ఇళ్ల కూల్చివేతలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానానికి, తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారి మాట్లాడటం పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆధిష్ఠానం ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రి సురేఖ వ్యాఖ్యల పట్ల సర్వత్రా తీవ్ర దుమారం రేగడంతో వెంటనే రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు బుధవారం రాత్రి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కు ఫోన్ చేసి ఆరా తీసినట్టు సమాచారం. ప్రభుత్వ, పార్టీ అప్రతిష్టపాలు కాకముందే డామేజ్ కంట్రోల్‌కు తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశకం చేసినట్టు సమాచారం. ఆ తర్వాతనే మహేశ్‌కుమార్‌గౌడ్ మంత్రి కొండా సురేఖతో మాట్లాడి తెల్లారేసరికి ఆమెతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటన చేయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ అధిష్టానం ముఖ్యుడు ఒకరు ఇటీవల రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాల పట్ల ‘వాట్ ఈజ్ గోయింగ్ ఆన్’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ అంశం చేయిదాటకముందే తానే స్వయంగా పరిస్థితిని చక్కదిద్దుతానని మహేశ్‌కుమార్‌గౌడ్ అధిష్ఠానం పెద్దలకు నచ్చజెప్పినట్టు తెలిసింది.

అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన మాజీ కేంద్ర మంత్రి
ఇలా ఉండగా మాజీ కేంద్ర మంత్రి ఒకరు బుధవారం సాయంత్రమే మంత్రి కొండా సురేఖ సుప్రసిద్ద సినీ ప్రముఖుడు దివంగత అక్కినేని నాగేశ్వర్‌రావు కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు , తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలను అధిష్ఠాన పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. జరిగిన ఉదంతంపై పూసగుచ్చినట్టు వివరించినట్టు తెలిసింది. ఈ అంశాన్ని సినీరంగ ప్రముఖులు కూడా తమ దృష్టికి తెచ్చారని చెప్పినట్టు తెలిసింది. ఈ అంశాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని, పీసీసీ అధ్యక్షునితో మాట్లాడి తగిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం.
అమలకు ప్రియాంక గాంధీ ఫోన్
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల షాక్‌కు గురైన సినీ హిరో అక్కినేని నాగార్జున సతీమణి అమలకు గురవారం ఉదయం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ఫోన్ చేసి మాట్లాడినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తమ కుటుంబ గౌరవాన్ని మంటగలిపారని ఈ సందర్భంగా అమల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. జరిగిన సంఘటనకు తాము చింతిస్తున్నామని, దీనిపై తగిన చర్య తీసుకుంటామని అమలను ప్రియాంకగాంధీ బుజ్జగించినట్టు తెలిసింది.

మంత్రులు నోరు జారవద్దని పీసీసీ అధినేత వార్నింగ్
మంత్రులు గానీ, పార్టీ నాయకులు గానీ ఎవరు కూడా నోరు జారవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ మేరకు పార్టీ నేతలను ఉద్దేశించి మహేశ్‌కుమార్‌గౌడ్ గురువారం ఒక వీడియో ప్రకటనన విడుదల చేశారు. పార్టీ క్రమశిక్షణా రేఖ దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయడంతో పాటు వాటిని ఉపసంహరించుకోవడంతో ఈ వివాదం సమిసిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని సినీరంగ ప్రముఖులు ఇంతటితో వదిలేయాలని కూడా ఆయన విజప్తి చేశారు.
సూమోటో గా స్వీకరించడం లేదు : మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరళ్ల
మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో ఈ అంశాన్ని తాము సూమోటోగా స్వీకరించడం లేదని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరళ్ల శారద ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మంత్రి వ్యాఖ్యలను సూమోటోగా తీసుకొని చర్య తీసుకోవాలని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలతో పాటు మహిళా సంఘాల నుంచి వచ్చిన డిమాండ్ పై కమిషన్ చైర్‌పర్సన్ నేరళ్ల శారద స్పందిస్తూ ఈ మేరకు ప్రకటన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News