Wednesday, January 8, 2025

బిసిలకు కాంగ్రెస్ భరోసా

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలనలో రాష్ట్రానికి వెన్నెముక లాంటి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతివ్వడం గర్వంగా ఉంది. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బిసిలకు అన్నిరంగాల్లో న్యాయం జరిగేలా కాంగ్రెస్ సర్కారు చర్యలు చేపట్టింది. మొదటి ఏడాది పాలనలో ప్రభుత్వం బిసిల్లో భరోసా నింపడంతోపాటు, వారికి రాజకీయంగా మెరుగైన అవకాశాలు కల్పించేలా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో బిసిల స్థితిగతులపై లోతైన అవగాహన ఉన్న కాంగ్రెస్ ఎన్నికల ముందు వారికిచ్చిన హామీలను మొదటి ఏడాదిలోనే నెరవేరుస్తూ, పరిస్థితులకు అనుగుణంగా బిసిల అభివృద్ధికోసం మరిన్ని చర్యలు చేపట్టిన ఘనతను దక్కించుకుంది. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో లేనివిధంగా రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులుగా బిసి నేతలకు అధిక ప్రాధాన్యతిచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా బిసి వర్గానికి చెందిన నన్ను ఎంపిక చేయడమే పార్టీకి బిసి వర్గంపట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తమ బతుకులు బాగుపడుతాయని భావించిన బడుగు బలహీన వర్గాల ఆశలను వమ్ము చేసింది పదేళ్ల బిఆర్‌ఎస్ పాలన. తమ కుటుంబంలోని నలుగురి వ్యక్తుల చేతిలోనే రాష్ట్రాన్ని బంధీ చేసి పరిపాలించి, అన్ని రంగాలను వెనుకబాటుకు గురిచేసిన కెసిఆర్ వెనుకబడిన తరగతులపై వివక్ష చూపారు. బిఆర్‌ఎస్ హయాంలో బిసిల కష్టాలను గుర్తించిన కాంగ్రెస్ రాహుల్ గాంధీ మార్గదర్శకంలో అసెంబ్లీ ఎన్నికల ముందే బిసి వర్గాల్లో భరోసా నింపేలా 2023 నవంబర్ 10వ తేదీన కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించి చారిత్రాత్మకమైన ‘బిసి డిక్లరేషన్’ ప్రకటించింది. శాసనసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ బిసిలకు 23 టికెట్లే కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 2 సీట్ల చొప్పున 34 మంది బిసిలను బరిలోకి దింపి వారికి రాజకీయ ప్రాధాన్యతిచ్చింది.

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు, కులగణన, బిసి కమిషన్ నివేదిక ఆధారంగా బిసిల రిజర్వేషన్ల పెంపు, బిసి సంక్షేమానికి భారీగా నిధుల కేటాయింపు, ఎంబిసి కులాల అభివృద్ధి కోసం చర్యలు, బిసి కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు, బిసి యువత చిరువ్యాపారాలు చేసుకునేందుకు, వారు ఉన్నత విద్య అభ్యసించేందుకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందజేయడం, ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాల స్థాయిలో బిసిలకు నూతన గురుకుల పాఠశాల ఏర్పాటు, ‘వృత్తి బజార్’ పేరిట ప్రతి మండలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు వంటి నిర్ణయాలను కామారెడ్డి ‘బిసి డిక్లరేష్’లో ప్రకటించిన కాంగ్రెస్, కులగణనపై కూడా హామీ ఇచ్చింది.

ఈ వాగ్దాలన్నింటినీ అమలు చేయడానికి మొదటి ఏడాదిలోనే అధిక ప్రాధాన్యతిచ్చి, వీటిలో చాలామటుకు పూర్తి చేసింది. మిగిలినవాటిని త్వరలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటూ బిసిలకు వెనుదన్నుగా నిలుస్తూ వారిలో విశ్వాసాన్ని కలిగించింది. మొదటి ఏడాది ప్రజాపాలనలోనే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటప్రకారం బిసిలకు ప్రాధాన్యతిస్తూ పలు చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంది.రాష్ట్ర జానాభాలో 50 శాతానికి పైగా ఉన్న బిసిలకు జనాభా ప్రాతిపదికన అన్నిరంగాల్లో న్యాయం జరిగేలా రాష్ట్రంలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేసేందుకు వేగవంతంగా ముందుకు సాగుతూ, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సర్వే చేపట్టేందుకు స్ఫూర్తిగా నిలబడింది మా కాంగ్రెస్ సర్కార్. అంతేకాక బిసిలపై జరుగుతున్న దాడులను, అన్యాయాలను అరికట్టడానికి అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలనే డిమాండ్ వచ్చినా బిఆర్‌ఎస్ పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది.

2024-25 బడ్జెట్లో రూ. 9200.32 కోట్లను బిసి సంక్షేమానికి కేటాయించింది కాంగ్రెస్.ఇవి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులకన్నా రూ.2971.32 కోట్లు అధికం. బిఆర్‌ఎస్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను 33% నుండి 23 శాతానికి తగ్గించి అన్యాయం చేశారు.బిఆర్‌ఎస్ చర్యలకు భిన్నంగా కాంగ్రెస్ 23 నుండి 42 శాతానికి పెంపుపై వేగవంతమైన చర్యలు తీసుకుంది. అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడమే కాకుండా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది. ఈ రిజర్వేషన్ల పెంపుతో రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాల్టీల్లో కొత్తగా సుమారు 24వేల మంది బిసిలకు ప్రాతినిధ్యం దక్కే అవకాశాలుంటాయి. పదేళ్ల బిఆర్‌ఎస్ హయాంలో స్థానిక సంస్థల్లో బిసిలకు జరిగిన అన్యాయం తీర్చలేనిది. రిజర్వేషన్లు పెంచకుండా కెసిఆర్ సర్కార్ వారిని రాజకీయంగా అణిచివేసింది. బిఆర్‌ఎస్ తప్పులను సరిద్దుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు ఎదురవుకుండా చర్యలు తీసుకుంటూ స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల అంశంలో ముందుకు సాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటైన అనతి కాలంలోనే కాంగ్రెస్ తెలంగాణ బిసి కమిషన్ ఏర్పాటు చేసి సభ్యులను నియమించింది. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న బిసి కులాల కార్పొరేషన్లు, వెల్ఫేర్ బోర్డులను కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసింది. ముదిరాజ్, యాదవ కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర సహకార సంఘాలను ఏర్పాటుచేసింది. అంతేకాక ఆర్థికంగా వెనుకబడిన తరగతుల ప్రత్యేక సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. బిసి కార్పొరేషన్‌ను 2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 73 కోట్లు, ఎంబిసి కార్పొరేషన్కు రూ. 400 కోట్లు, బిసి కులాల కార్పొరేషన్, ఫెడరేషన్లకు 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్ల చొప్పున కేటాయించి బిసి అభివృద్ధిపై తమకున్న నిబద్ధ్దతను నిరూపించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
గీతన్నల కష్టాలను గుర్తించి వారి కోసం ‘తాడి కార్పొరేషన్’ ఏర్పాటు చేసి ‘కాటమయ్య రక్షణ’ కింద 10 వేల మందికి రక్షణ కిట్టుతోపాటు తగు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రజక, నాయీబ్రాహ్మణ కులాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ వారికి ఆర్థికంగా తోడ్పడింది ప్రభుత్వం.

కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ పథకం కింద ఆర్థిక సాయం అర్హులకు అందేలా రాష్ట్ర అధికారులు వేగవంతంగా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కెసిఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాల గురుకులాలు, హాస్టళ్లు వివక్షకు గురై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొన్న బాధలు వర్ణనాతీతం. ఏ రోజు ఎలాంటి ఇబ్బంది వస్తుందో భయాందోళనలతో విద్యార్థులు, ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళనలో వారి తల్లిదండ్రులు దినదిన గండంగా గడిపారు. అధికారంలోకి వచ్చిన తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలు, హాస్టళ్ల రూపురేఖలు మార్చాలని కంకణం కట్టుకొని చర్యలు ప్రారంభించింది. గత నెలలో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కలతో సహా రాష్ట్రమంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో, హాస్టళ్లలో, పాఠశాలల్లో పర్యటించి ఒక పండుగలా ‘కామన్ డైట్’ కార్యక్రమాన్ని నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన పోషకాహార మెనూను ప్రకటించారు. బిఆర్‌ఎస్ హయాంలో నామమాత్రంగా ఉన్న డైట్చార్జీలను 40%, కాస్మెటిక్ చార్జీలను 200% పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం కెసిఆర్ పాలనలో అభద్రతా భావం నెలకొన్న విద్యార్థుల్లో భరోసా నింపింది. అంతేకాక మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లో కొత్తగా 5 వేలకు పైగా ఉద్యోగులను నియమించింది. బిసి హాస్టళ్ల పక్కాభవనాల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాలకుగాను రూ. 100 కోట్లు కేటాయించింది. 28 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.బిసి హాస్టళ్లకు ఉచిత విద్యుత్ అందించింది. ఏడాది పాలనలో బిసి స్టడీ సర్కిల్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ అందిచడంతోపాటు, 3579 మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది.

మరోవైపు సావిత్రి బాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెను గౌరవించింది.మంత్రులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా బిసి నేతలను కాంగ్రెస్ ఎంపిక చేసినట్టు బిఆర్‌ఎస్ ఎంపిక చేయగలదా..? అంతేకాదు కాంగ్రెస్ మొదటి ఏడాదే బిసి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వారిలో భరోసా కల్పించింది. ధర్నాలు, నిరసనలకు దిగుతున్న ప్రతిపక్ష నేతలు ఈ వాస్తవాలను కాదనగలరా…? కాంగ్రెస్ ఏడాదిలో చేపట్టిన బిసి సంక్షేమ కార్యక్రమాలపై మాతో చర్చించడానికి బిఆర్‌ఎస్ నేతలు సిద్ధమా అని నేను సవాలు చేస్తున్నాను.

బి. మహేశ్ కుమార్ గౌడ్
(టిపిసిసి అధ్యక్షులు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News