హైదరాబాద్ : మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో చిట్‌చాట్ చేస్తూ గురువారం సాయంత్రం మైనంపల్లి కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు. తొందరలోనే వేముల వీరేశం చేరిక ఉంటుందని కూడా ఆయనన్నారు. పార్టీ లో చేరడానికి అందరికీ ఆహ్వానమే నన్న రేవంత్ రెడ్డి టికెట్ విషయంలో స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుందన్నారు. బిసి లకు 34 సీట్లు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నామన్న ఆయన బిఆర్‌ఎస్ కంటే బిసిలకు ఎక్కువ సీట్లు ఇస్తామని మాత్రం స్పష్టం చేశారు. అన్ని సమాజికవర్గాల వారు మా పార్టీ లో బలమైన వాదన వినిపించారు, వారి తరుపున సెంట్రల్ ఎలక్షన్ కమిటీ లో నూ వాదన ఉంటుంది. అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో ఎంతో మంది బిసిలు పిసిసి ఛీఫ్ గా చేసారని తెలిపారు. కాంగ్రెస్ లో విడతల వారిగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు.
సిఈసి మీటింగ్ పెట్టాలని ఎఐసిసి ని కోరామని, సిఈసి సమావేశం తర్వాత పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అవుతుందని ఆయన చెప్పారు. 9 ఏళ్ళలో రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఫ్యాక్ట్, అండ్ ఫిగర్స్ మాట్లాడుతాడని రేవంత్ అన్నారు. ఎంఐఎం, బిఆర్‌ఎస్ లేని చోట బిజెపికి ఓటు వేయాలని అసదుద్దీన్ చెప్తున్నారని ఆయన విమర్శించారు. ఎంఎల్‌సిల ఎంపిక అనేక కేటగిరీ లలో జరుగుతుందని, కేటగిరీ ని బట్టి ఎంపిక విధానం ఉంటుందని టిపిసిసి చీఫ్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ఎంపిక కు , ఎంఎల్‌సి ల ఎంపిక కు సంబంధం లేదని ఆయనన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర ఉంటుందన్నారు. మా సర్వే లలో బిఆర్‌ఎస్ 25 సీట్లు దాటదు , బిజెపి, ఎంఐఎం లు సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతాయని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.