Monday, December 23, 2024

కర్నాటక కాంగ్రెస్‌లో సంక్షోభం..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వం ఏర్పాటు ముందు నుంచి పార్టీలో నెలకొని ఉన్న అత్యంత ప్రాబల్యపు డికె, సిద్ధరామయ్యల క్యాంప్‌లు ఇప్పుడు బహిరంగంగా తలపడే దశకు చేరుకున్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వంలో ముసలం పరాకాష్టకు చేరుకుంది. ఈ పరిస్థితిని గమనించి బుధవారం ఎఐసిసి తరఫున కాంగ్రెస్ ప్రముఖ నేతలు రణదీప్ సూర్జేవాలా, కెసి వేణుగోపాల్ హుటాహుటిన బెంగళూరు చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి , కర్నాటక వ్యవహారాల పర్యవేక్షకులు రణదీప్ సింగ్ సూర్జేవాలా పార్టీ నేతలు సిద్ధరామయ్య, డికె శివకుమార్ వర్గీయులకు తీవ్ర హెచ్చరికలు వెలువరించారు.

ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలకుదిగరాదని , ఇది ఇప్పటి దశలో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఇద్దరు నేతలను ఘాటుగా నిలదీసినట్లు వెల్లడైంది. కర్నాకటలోని ప్రముఖ విశ్వసనీయ వార్తా పత్రికలు, మీడియా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభంపై ప్రముఖంగా దృష్టి సారించి వార్తలు వెలువరిస్తున్నాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడరాదని హితవు పలికారు. ఇది తమ తిరుగులేని, నిర్ధందపు హెచ్చరిక అని, అంతా దీనికి కట్టుబడి ఉండాల్సిందేనని పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చిన రణదీప్ సూర్జేవాలా చెప్పారు.

కట్టడికి అవసరం అయితే విప్
తమ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించకపోతే , ఇప్పటికీ బహిరంగంగా విమర్శలు మానుకోకపోతే ఎవరైనా సరే సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పార్టీని కట్టడి చేసేందుకు అవసరం అయితే విప్ జారీ చేయడం జరుగుతుందని సూర్జేవాలా తెలిపారు. ఇంతటి తీవ్ర పరిస్థితి రాదనే తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పదవికాలంపై సిద్ధరామయ్య, డికె వర్గీయులు తరచూ బహిరంగ వ్యాఖ్యలకు దిగడంతో పార్టీ వర్గాలలో గందరగోళం నెలకొంటోంది. ఇద్దరు నేతల నడుమ అధికార పంపిణీ డీల్ ఉందనేది స్పష్టం అవుతోందని, ఇది పార్టీ బలహీనానికి దారితీస్తుందని పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా సబంధిత విషయంపై ప్రకటనలకు దిగరాదు. , ఇందుకు ఎవరికీ ఎవరూ అధికారం ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు ఈ రాజకీయాకు దిగకుండా వారివారి నియోజకవర్గాలపై దృష్టి పెడితే మంచిదని సూర్జేవాలా హెచ్చరించారు.

అంతకు ముందు డికె, సిద్ధరామయ్యలతో రహస్య మంతనాలు
ఢిల్లీ నుంచి ఇక్కడికి చేరిన వెంటనే సూర్జేవాలా, కెసి వేణుగోపాల్‌లు ముందుగా సిద్ధరామయ్య, డిఎకెలతో రెండు గంటల పాటు రహస్య సమావేశం నిర్వహించారు. 165 రోజుల కాంగ్రెస్ పాలన పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటి పరిణామాలకు చెక్ పెట్టేందుకు ఇరువురు నేతలు ముందుకు రావాలని ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు చెప్పారు. ముందుగా మద్దతుదార్లను కట్టడి చేసుకుంటే మంచిదని ఇరువురు నేతలకు ఢిల్లీ నేతలు చెప్పినట్లు వెల్లడైంది.
కాంగ్రెస్‌లో బెల్గావి కురుక్షేత్ర ..జర్కిహోలీ బ్రదర్స్ హవా
పీఠంపై పట్టుపట్టిన పార్టీలో ప్రాబల్యపు నేత డికె శివకుమార్ ఎట్టకేలకు డిప్యూటీ సిఎం, ఇతరత్రా కీలక మంత్రిపదవులతో అధిష్టానం రాజీ సూత్రంతో సిద్ధరామయ్య నేతృత్వంలో పనిచేయడానికి అంగీకరించినా , డికె వర్గీయులలో అసమ్మతి తీవ్రస్థాయిలో ఉంది. దీనితో ప్రభుత్వం ఏర్పాటు నాటి నుంచి అటు డికె, ఇటు సిద్ధరామయ్య ఎప్పటికప్పుడు చెక్‌లు పెట్టుకుంటూ వస్తున్నారు. పైగా తనకు వ్యతిరేకంగా సిఎం సిద్ధరామయ్య ఎమ్మెల్యేలను, మంత్రులను కొందరిని రెచ్చగొడుతున్నారని డికె మండిపడుతున్నారు. ఇరువురి నడుమ తీవ్రస్థాయిలో ఉన్న విభేదాలు ఇప్పుడు హైకమాండ్ రెక్కలు కట్టుకుని బెంగళూరుకు వచ్చివాలే వరకూ చేరుకున్నాయి. సీనియర్ మంత్రులు చెరో పక్షం వైపు చేరుకుని పరస్పరం కత్తులు నూరుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకించి రాష్ట్రంలో అత్యంత కీలకమైన కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామక ప్రక్రియ అసలుకే ముఠా తగాదాల పార్టీగా ఉండే కాంగ్రెస్‌లో మరింత చిచ్చుకు దారితీసింది.

కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులు తమకంటే తమకని సిద్ధరామయ్య, డికెలు కలహించుకోవడం ఈ దశలోనే సిద్ధరామయ్యకు ఒబిసిల బలీయ నేతలు అయిన పబ్లిక్ వర్క్ మంత్రి సతీష్ జర్కిహోలి, సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్‌సి, మహాదేవప్ప , సహకార మంత్రి కెఎన్ రాజన్నలు మద్దతు పలకడంతో డికె మరింత ఫైర్ అయినట్లు వెల్లడైంది. కాగా రాష్ట్రంలో బలీయమైన వొక్కలింగ కులస్తుల నేత అయిన డికె శివకుమార్‌ను బలపర్చే ఎమ్మెల్యేలు అత్యధికులు చివరికి క్యాంప్ రాజకీయాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. పార్టీలో రెండు వర్గాలు సవాళ్లు విసురుకునే పరిస్థితి ఇప్పుడు చెరకు ధాన్యాగారం అయిన బెల్గావితో మరింత తీవ్రతరం అయింది. ఈ ప్రాంతంలో ఐదుగురు సోదరుల జర్కిహోలి కుటుంబం బలీయంగా ఉంది. వీరితో శివకుమార్‌కు అత్యంత సన్నిహితుడు అయిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి లక్ష్మి హెబాల్కర్ తలపడుతున్నారు. తమ అదుపులో ఉండాల్సిన ఈ జిల్లాలో డికె ఈ మహిళా మంత్రిద్వారా చక్రం తిప్పే యోచనలో ఉన్నారని జర్కిహోలి బ్రదర్స్ మండిపడుతున్నారు. డిప్యూటీ సిఎం తన పరిమితి దాటి వ్యవహరిస్తున్నాడని సిఎంకు ఫిర్యాదు చేశారు.

ఇది ఇప్పుడు పార్టీలో డికె, ఆయన వర్గీయులు ఓ వైపు, సిద్ధరామయ్య ఆయన మద్దతుదార్లు మరో వైపు ఈ విధంగా రెండు వర్గాలుగా కాంగ్రెస్ చీలిందని స్థానిక మీడియాల్లో వార్తలు వెలువడ్డాయి. తనకు జిల్లా రాజకీయాలు కీలకం అని, దీనికి ఎవరూ చెక్ పెట్టడానికి వీల్లేదని మంత్ర జర్కిహోలి తెలిపారు. రెండు వారాల క్రితం జర్కిహోలి తన మద్దతుదార్లు అయిన 20 మంది ఎమ్మెల్యేలతో ఓ బృందాన్ని మైసూరుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఇక్కడికి వీరిని దసరా ఉత్సవాలకు తీసుకువెళ్లినట్లు ఆయన తెలియచేసినా , ఇది తన బలప్రదర్శనకు చేపట్టిన విన్యాసం అని వెల్లడైంది. అయితే ఈ దశలో కాంగ్రెస్ హైకమాండ్ కలుగచేసుకుని ఇటువంటి యాత్రలు వద్దని తెలిపింది. దీనికి ప్రతిగా శివకుమార్ తన వర్గీయులతో బెల్గావిలోనే పోటీగా దసరా ఉత్సవాలు నిర్వహించారు. దీనికి జర్కిహోలీ వర్గీయులు రాలేదు. అడ్డంకులకు యత్నించారు.

సీనియర్ మంత్రి జి పరమేశ్వర్ రంగంలోకి
ఇప్పుడు ఏకంగా హైకమాండ్ బెంగళూరుకు వచ్చి పార్టీ పరిస్థితిపై స్పందిస్తున్న దశలో సీనియర్ మంత్రి జి పరమేశ్వర జర్కిహోళీ అనుచరులతో సమావేశం అయ్యారు.
పరిస్థితిపై బిజెపి, జెడిఎస్ డేగకన్ను
కర్నాటకలో రెండు ప్రాబల్య వర్గాల ఢీ పరిస్థితిని ప్రతిపక్ష బిజెపి, అనుబంధ జెడిఎస్ జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇది చివరికి పతనానికి దారితీస్తే తాము చేయాల్సిన పని గురించి విశ్లేషించుకుంటున్నాయి. ఇప్పటికే బిజెపి నాయకత్వం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో లోపాయికారిగా మాట్లాడినట్లు వెల్లడైంది. అసంతృప్తులకు పలు విధాలుగా ఆశలు చూపింది. దీనితో రాష్ట్రంలో కాంగ్రెస్ క్యాంప్‌లు ఏర్పడితే వెంటనే దీనిని బిజెపి వాడుకుంటుందని వెల్లడైంది. కాగా ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం తీరిక లేకుండా ఉంది. కర్నాటకలో కులాలు, వర్గాలు చివరికి మఠాల ఆధిపత్యపు రాజకీయాల తెరల వెనుక సాగుతున్న వ్యవహారాలపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఢిల్లీ నాయకత్వం దృష్టి సారించే పరిస్థితి లేదని స్థానిక పత్రిక ఒకటి రాసింది. ఈ పరిస్థితితో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చాపకింద నీరు వ్యవహారం తయారయిందని విశ్లేషకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News