Monday, January 20, 2025

నేరస్థుల చేతుల్లో ధరణి

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు
50లక్షల మంది రైతుల భూముల వివరాలు

ఇప్పటివరకు ధరణిని నిర్వహించిన సంస్థలన్నీ ఆర్థిక నేరాలకు
స్వర్గధామమైన దేశాలకు చెందినవే ఫిలిప్పిన్స్, సింగపూర్, కేమాన్
ఐలాండ్స్, వర్జిన్ ఐలాండ్‌లలో ధరణి చక్కర్లు పోర్టల్ ఏ కంపెనీకి వెళ్లినా
కెటిఆర్ సన్నిహితుడే సిఇఒ క్రిమినల్ నేపథ్యమున్న కంపెనీలను టెండర్లలో నిషేధించాల్సి ఉన్నా విస్మరించిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం కెటిఆర్,
కెసిఆర్‌లకు శిక్షలు పడాల్సిందే అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి

లోపభూయిష్టంగా ఉన్న ధరణితో సమాచారాన్ని దేశం దాటించారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ రైతులను తమ భూములకు దూరం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. తన మెదడును రంగరించి మాజీ సిఎం కెసిఆర్ ఒక అద్భుత చట్టాన్ని తీసుకొస్తున్నామని ఆనాడు సభలో చెప్పారని, ధరణి పోర్టల్ కెసిఆర్ సొంతంగా కనిపెట్టింది కాదని, 2010లోనే ఒడిశాలో ఈ -ధరణి పేరుతో ఐఎల్‌ఎఫ్‌ఎస్ కంపెనీకి బాధ్యతలు అప్పగించిందని సి ఎం రేవంత్ అన్నారు. ఒడిశా సర్కారే తప్పు చే సిందని కాగ్ సూచిందన్నారు. భారతి రెవె న్యూ బిల్లుపై చర్చ సందర్బంగా అసెంబ్లీలో సి ఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ధరణిలో లోపాలున్నాయని కాగ్ కూడా తేల్చిందన్నారు. అర్హత లేని కంపెనీకి ధరణిని అప్పగించారని 2014లోనే కా గ్ తప్పుబట్టిందన్నారు. కాగ్ తప్పుబట్టిన ధరణిని కెసిఆర్ తెలంగాణకు ఎందుకు తీసుకొచ్చారని సిఎం రేవంత్ ప్రశ్నించారు. సత్యం రామలింగరాజుతో సంబంధం ఉన్న వ్యక్తులకు ధరణి టెం డర్లు దక్కాయని ఆయన ఆరోపించారు. క్రిమినల్ కేసులున్న కంపెనీకి ధరణి టెండర్లు అప్పగించారని ఆయన విమర్శించారు. యువరాజు కెటిఆర్‌కు అత్యంత సన్నిహితులైన వ్యక్తులకు ఈ ధర ణి టెండర్లు దక్కాయన్నారు. ఆర్థిక నేరాలకు పా ల్పడే దేశాల్లో ధరణి ఉందని రేవంత్ ఆరోపించారు. ధరణి చట్టాన్ని రీప్లేస్ చేస్తూ కొత్త చట్టం తీసుకొస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు.

కోటి 52 లక్షల ఎకరాల భూముల వివరాలను భద్రపరుస్తాం
అర్హులైన ప్రతి భూ యజమానులు హక్కులు కాపాడేందుకు ఈ కొత్త చట్టాన్ని సభలో ప్రవేశపెట్టామని, చర్చ జరగడం ద్వారా తెలంగాణ రైతులకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురావలని భావించామని సిఎం రేవంత్ తెలిపారు. ప్రతిపక్ష పార్టీ అహంభావం, అహంకారంతో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించిందన్నారు. ఈ కొత్త చట్టం ద్వారా కోటి 52 లక్షల ఎకరాల భూముల వివరాలను భద్రపరుస్తామని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రతి భూ యజమాని హక్కులను కాపాడుతామని రేవంత్ తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ రూల్స్ ఉల్లంఘించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చను అడ్డుకోవడానికి బిఆర్‌ఎస్ కుట్ర చేసిందన్నారు. అమర్యాదతో స్పీకర్‌పై పేపర్లు విసిరారని, ఓపిక నశించి చర్యలకు దిగాల్సి ఉన్నా స్పీకర్ ఎంతో ఓపికగా ఉన్నారని సిఎం రేవంత్ ప్రశంసించారు. తెలంగాణ ప్రజలకు భూమి ఆత్మగౌరవం. భూమి కోసం సకల తెలంగాణ ప్రజలు పోరాడిన సందర్భాలున్నాయి. భూమి కోసం ఎంతో మంది యోధులు త్యాగాలు చేశారని రేవంత్ తెలిపారు.

గతంలో ఎంతోమంది భూపోరాటాలు….
రాష్ట్రంలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూమినే తమ హక్కుగా భావించి సాయుధ రైతాంగ పోరాటం చేశారని, అధికారంతో, అహంకారంతో ఆధిపత్యాన్ని చేలాయించాలని చూసినా భూమిని కాపాడుకోవడంలో వారు విజయం సాధించారన్నారు. ఆ తరువాత ఎప్పుడు ఏ ఉద్యమం వచ్చినా భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుకు కూడా కొంతమంది భూమిపై ఆధిపత్యం చెలాయించడమే కారణమని సిఎం పేర్కొన్నారు. గతంలో రావి నారాయణ, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం, అరుట్ల కమలాదేవి, అరుట్ల రాంచంద్రా రెడ్డి వంటి వారు భూపోరాటాలు చేశారన్నారు. భూమిని కాపాడుకునే క్రమంలోనే దొడ్డి కొమురయ్య లాంటివారు ప్రాణాలు కోల్పోయారని రేవంత్ రెడ్డి తెలిపారు.

సర్వం ఒడ్డి పోరాటాలు చేసి భూములు కాపాడుకున్నారన్నారు. తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి అని సిఎం అన్నారు. భూమిలేని పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వం భూమి ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టిందన్నారు. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులను కాపాడేందుకు గతంలో ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. భూమిలేని పేదలకు అసైన్డ్ పట్టాలు ఇచ్చి ఇందిరాగాంధీ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు. నిజమైన భూ యజమాని హక్కులను కాపాడాలన్నారు. లేకపోతే చదువులేని వారి భూములు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని, వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు వీలైనంత మేరకు ప్రజలకు ఉపయోగపడేలా చట్టాలు సవరించాయని సిఎం రేవంత్ తెలిపారు.

క్రిమినల్ నేపథ్యం ఉన్న కంపెనీలను టెండర్‌లు
విపక్ష పార్టీ అహంభావంతో వ్యవహారిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. యువరాజుకు అత్యంత సన్నిహితులైన వారికి ధరణి పోర్టల్‌ను అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్లినా సీఈఓగా గాదే శ్రీధర్‌రాజు ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2018లో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌తో పాటు గాదె శ్రీధర్‌కు చెందిన ఈ సెట్రిక్, విజన్ ఇన్‌ఫోటెక్‌లు సంయుక్తంగా కాంట్రాక్టు దక్కించుకున్నాయని సిఎం రేవంత్ తెలిపారు. క్రిమినల్ నేపథ్యం ఉన్న కంపెనీలను టెండర్లలో నిషేధించే విధానం ఉన్నా, కెసిఆర్ ఆ పని చేయలేదని, భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని రకాల బాధ్యతలు ఆ కంపెనీకి అప్పగించారని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

ఫిలిప్పిన్స్ దేశానికి చెందిన ఫాల్కాన్ ఎస్‌జి
ఆ తరువాత ఐఎల్‌ఎఫ్‌ఎస్ సబ్సిడరీ కంపెనీ అయిన టెరాసిస్ ధరణి కాంట్రాక్టును దక్కించుకుందన్నారు. ఈ టెర్రాసిస్ లో 99 శాతం షేర్లు ఫిలిప్పిన్స్ దేశానికి చెందిన ఫాల్కాన్ ఎస్‌జి అనే సంస్థ రెండుదఫాలుగా 2021లో దానిని కొనుగోలు చేసిందన్నారు. మిగిలిన ఒక్క శాతం వాటా మాత్రం కెటిఆర్ మిత్రుడు గాదె శ్రీధర్ రాజు కొనుగోలు చేశారని సిఎం తెలిపారు. ఆ ఒక్క శాతం షేరుతోనే శ్రీధర్ రాజు టెరాసిస్‌కు సీఈఓగా అవతారం ఎత్తారని సిఎం ఆరోపించారు. ఫాల్కాన్ ఎస్‌జి (ఫిలిప్పిన్స్) సంస్థలోని 100 శాతం షేర్లను సింగపూర్ బేస్డ్ కంపెనీలో 100 శాతం వాటాను ఐదు కంపెనీలు (స్పారో ఇన్వ్‌స్టెంట్‌మెంట్, జిడబ్లు స్కై, హిల్ బ్రుక్స్ ఇన్వ్‌స్టెంట్‌మెంట్, పారడిజిమే ఇన్నోవేషన్, క్వంటాల ఐఎన్‌సి, ఫాల్కాన్ ఇన్వ్‌స్టెంట్‌మెంట్ (సింగపూర్)లు) కొనుగోలు చేశాయని సిఎం తెలిపారు. మళ్లీ ఇందులో స్పారో ఇన్వ్‌స్టెంట్‌మెంట్ అనే సంస్థలో 100 శాతం వాటాలను గేట్‌వే ఫౌండ్ 2 అనే కంపెనీ చేతుల్లోకి వెళ్లాయని ఆయన పేర్కొన్నారు.

ఆర్థిక నేరాలకు స్వర్గధామంగా పేరుగాంచిన సైమన్స్ ఐస్‌ల్యాండ్
ఆ కంపెనీ మూలాలు ఎక్కడ ఉన్నాయని తెలుసుకుంటే పన్ను ఎగవేతలకు, ఆర్థిక నేరాలకు స్వర్గధామంగా పేరుగాంచిన సైమన్స్ ఐస్‌ల్యాండ్ అనే దీవిలో ఉన్నాయని తేలిందని సిఎం రేవంత్ తెలిపారు. ఐదింటిలో మరో కంపెనీ అయిన హిల్ బ్రుక్స్ ఇన్వ్‌స్టెంట్‌మెంట్ మూలాలు కూడా పన్ను ఎగవేత, ఆర్థిక నేరాలకు స్వర్గధామంగా భావించే బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లో ఉన్నాయని సిఎం పేర్కొన్నారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న వారిలో ఎవరూ ఈ దేశానికి చెందిన వ్యక్తులు కాదని, అలాంటి వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ రైతుల భూముల వివరాలు పెట్టారని సిఎం అన్నారు.

రెవెన్యూ డిపార్ట్ మెంట్, భూ యజమానికి మధ్య ఉండాల్సిన డేటాను డిజిటల్ పోర్టల్ నెపంతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారని, ఇన్ని రోజులుగా విలువైన సమాచారం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉందన్నారు. 50 లక్షల రైతుల వివరాలు, భూముల వివరాలను ఈ సంస్థల చేతిలో పెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. టెరాసిస్ చేతిలో పెట్టిన ధరణి పోర్టల్ పది సంస్థల చేతులు మారిందని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మన ధరణి పోర్టల్ ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ ఐలాండ్స్, వర్జిన్ ఐలాండ్ మీదుగా తిరిగిందన్నారు. ఆర్థిక నేరాలకు పేరొందిన దేశాలు, సంస్థల చేతుల్లో మన రైతుల వివరాలను పెట్టారని సిఎం రేవంత్ మండిపడ్డారు. ఎంతో విలువైన సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన కెసిఆర్‌ను శిక్షించాలన్నారు.

తెలంగాణలో కాకుండా ఈశాన్య రాష్ట్రాల నుంచి ధరణి
ఇది ఎంత తీవ్రమైన నేరమో ఒక్కసారి ఆలోచించాలని, ప్రజలకు ద్రోహం చేసి, మోసం చేసి సంపూర్ణ సమాచారాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించారంటే దీనిపై ఎలాంటి విచారణ చేయాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంసీహెచ్‌ఆర్డీలో అద్భుతమైన సాంకేతిక ఉందని, ఇతర రాష్ట్రాలకు మన సాంకేతికతను అందిస్తున్న పరిస్థితుల్లో వీళ్లు విదేశీ కంపెనీలకు అప్పగించారని సిఎం రేవంత్ తెలిపారు. గతంలో సభలో కెసిఆర్ ఆవేశంతో ఊగిపోతుంటే ఆనాడు తనకు అర్ధం కాలేదని, ధరణిలో ఎన్నో ఎకరాల భూదాన్ భూములు, ప్రైవేటు భూముల యజమానుల పేర్లు మారాయన్నారు. అగ్రిమెంట్ లోని 9.20 క్లాజ్ ప్రకారం యజమాని పేరు మార్చడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని, 9.20.4 క్లాజ్ లో పేర్కొన్నట్లు ప్రభుత్వ ఆఫీసులో ఉండి పనులు చేయాలని, రెవెన్యూ శాఖకు సంబంధించిన సిసిఎల్‌ఏ కార్యాలయం నుంచి పని చేయాలని, తెలంగాణలో కాకుండా విజయవాడలో, బెంగుళూరుకు, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ ధరణి పోర్టల్‌ను నిర్వహించారని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు.

పగలు జరగాల్సిన రిజిస్ట్రేషన్‌లు అర్ధరాత్రి కూడా
ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లేని కంపెనీలకు, విదేశీయులకు అప్పగించి ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని సిఎం రేవంత్ తెలిపారు. దీనిపై ఎంత కఠినమైన శిక్ష వేయాల్సిన అవసరం ఉందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. గోప్యంగా ఉంచాల్సిన సమాచారం ఆ వ్యక్తికి తెలియకుండా ఎవరికీ ఇవ్వొద్దని చట్టాలు చెబుతున్నాయని, కానీ, కెసిఆర్, కెటిఆర్ ఇతర దేశాల వ్యక్తులకు ఈ సమాచారం అప్పగించారన్నారు. ఇంత ఎంత తీవ్రమైన నేరం..? ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లేందుకు చాలా సమావేశాలు నిర్వహించి భూ భారతి చట్టాన్ని సభ ముందుకు తీసుకొచ్చిందన్నారు. ధరణిలో పగలు జరగాల్సిన రిజిస్ట్రేషన్‌లు అర్ధరాత్రి కూడా జరిగాయని సిఎం రేవంత్ తెలిపారు.

అర్ధరాత్రి రిజిస్ట్రేషన్‌లు చేసే వ్యవస్థ ఏ రాష్ట్రంలోనైనా ఉందా? బండారం బయటపడుతుందని ఈ రోజు చర్చ జరగకుండా ప్రయత్నాలు చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు. ఆనాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫిర్యాదు చేసినా లెక్కచేయకుండా తిమ్మాపూర్ భూదాన్ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరుకు మార్చారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక కేసులు నమోదు చేశామని సిఎం తెలిపారు. రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో వేల ఎకరాల భూములను బదిలీ చేశారని, ఎక్కడి నుంచైనా, ఏ పేరుకైనా మార్చేలా స్వైర విహారం చేసే అధికారం ఈ సంస్థకు అప్పగించారని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి అద్భుతమైతే సభలో ఉండి మమ్మల్ని నిలదీయాలి కదా…? 80వేల పుస్తకాల జ్ఞానంతో సృష్టించిన ధరణి గురించి సంపూర్ణంగా వివరించవచ్చు కదా, ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగొద్దని తొండి చేయాలని ప్రయత్నించి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారని సిఎం రేవంత్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News