జగిత్యాల: వరంగల్ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పట్టభద్రుల ఎంఎల్‌సి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్‌ఆర్‌ఐలతో రేవంత్‌రెడ్ది చిట్‌చాట్‌లో రైతుబంధు, ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ విధానం ఎలా ఉంటుందనే దానిని వివరిస్తే బిఆర్‌ఎస్ నాయకులు దానిని వక్రీకరించారన్నారు. ఉచిత విద్యుత్ ఆలోచన రాజకీయ పార్టీల్లో మెదలడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు.
మొట్టమొదట ఉచితంగా విద్యుత్ అందించాలని ఆలోచన చేసేంది కాంగ్రెస్ పార్టీయేనని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ సిఎంగా మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైలుపై చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయని, కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు రెండు దశల్లో 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్‌ఫార్మర్ల వారీగా ఏ మేరకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే రైతులు రోడ్డెక్కితేగానీ మరమ్మత్తులు చేయలేదని, ఆనాడు తాను శాసనసభలో మాట్లాడి జగిత్యాలకు ప్రత్యేకంగా 200 టాన్స్‌ఫార్మర్లు తెప్పించానని జీవన్‌రెడ్డి గుర్తు చేశారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు పండించిన పంటలను కళ్లాల వద్ద కొనుగోలు చేశామని, తప్ప, తాలు పేరుతో కోతలు విధించలేదన్నారు. రైతు రుణాలను ఏక మొత్తంలో మాఫీ చేశామని, ఎన్నికల్లో వాగ్దానం చేయకపోయినా రైతుల విద్యుత్ బకాయిలన్నీ మాఫీ చేశామన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో క్వింటాళుకు 5 కిలోల కోత విధించడంతో ప్రతి రైతు ఎకరానికి కనీసం రూ.2000 నష్టపోయారన్నారు.
వరంగల్ డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లు తాము అధికారంలోకి రాగానే రైతుబంధు పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తామన్నారు. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాళుకు రూ.500 బోనస్ అందిస్తామన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి, నిరసనలకు దిగడం సరికాదన్నారు. రైతుల రుణ మాఫీ చేయనందుకు, వడ్డీ రాయితీ నిలిపివేసినందుకు మమ్మల్ని ధర్నాలు చేయమంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిఆర్‌ఎస్ పార్టీ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు అవాకులు, చెవాకులు మాట్లాడితే ప్రజలు హర్షించరని జీవన్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, పిసిసి కార్యదర్శి బండ శంకర్, డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మన్‌కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, ఎంపిపి మసర్తి రమేశ్, జున్ను రాజేందర్, కోండ్ర రాంచంద్రారెడ్డి, నవీన్‌రావు, లక్ష్మన్‌రావు, చాంద్‌పాషా, మన్సూర్, నేహాల్, పుప్పాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.