Thursday, November 14, 2024

రాహుల్ పోటీపై స్మృతి ఇరానీ ఎద్దేవా

- Advertisement -
- Advertisement -

అమేథీ(ఉత్తర్ ప్రదేశ్: అమేథీ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంలో జరుగుతున్న జాప్యాన్ని స్థానిక బిజెపి ఎంపి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. అమేథీ శక్తి ఏమిటో వారు(కాంగ్రెస్) గ్రహించినట్లు కనపడుతోందని, ఓటమి భయం ఆ పార్టీని వెంటాడుతోందని ఆమె వ్యాఖ్యానించారు. తన నియోజవకర్గంలో రూ. 206 కోట్ల విలువైన 284 ప్రాజెక్టులలో కొన్నిటిని ప్రారంభించగా కొన్నిటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడం గురించి విలేకరులు ప్రశ్నించగా ఆ పార్టీ నుంచి ఎవరు పోటీచేస్తారో ప్రస్తుతానికి తనకు తెలియదని ఆమె అన్నారు.

అయితే ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరును ప్రకటించడానికి ఆ పార్టీ వారు ధైర్యాన్ని కూడగట్టుకోలేకపోవడాన్ని బట్టి చూస్తే అమేథీ శక్తి, ఓటమి భయం వారిని వెన్నాడుతోందని అర్థమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు. ఇది వారి ఓటమిని స్పష్టంగా సూచిస్తోందని ఆమె చెప్పారు. అమేథీ నియోజకవర్గంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ 2014లో తాను ఇక్కడకు వచ్చానని, కాని కాని ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యానని చెప్పారు. అయితే తాను ప్రజలకు సేవ చేయడం కొనసాగించానని, 2019లో బిజెపి తనకు మరోసారి అవకాశం ఇవ్వగా అమేథీ ప్రజలు తనను ఆమోదించారని ఆమె చెప్పారు.

2019లో అమేథీలో చరిత్ర సృష్టించామని ఆమె తెలిపారు. నియోజకవర్గ ప్రజల కోసం తాను గత ఐదు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి పనులను ఆమె వివరించారు. ఇక్కడి యువతకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని గతంలో ఇవ్వలేదని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు గత ఏడాది యువజన క్రీడా పోటీలు నిర్వహిస్తే 1.11 లక్షల మంది యువజనులు పాల్గొన్నారని ఆమె తెలిపారు. 2024లో మళ్లీ ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని బిజెపి కల్పించిందని, అఖండ మెజారిటీతో బిజెపి గెలుపొంది కొత్త చరిత్రను సృష్టించనున్నదని, ఇందులో అమేథీకి కూడా సంబంధముంటుందని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News