Sunday, December 22, 2024

కాంగ్రెస్ మోసపూరిత హమీలతో డ్రామాలు చేస్తోంది: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో బిజెపి, బిఆర్‌ఎస్ ఒకటేనని చెప్పడానికి కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీకి సిగ్గు ఉండాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం సోమాజిగూడ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాహుల్ నీ పార్టీ ఏంటి ?కెసిఆర్ పార్టీ ఏంటని ? నిలదీస్తూ, మీ ఇంటికి ఢిల్లీకి రమ్మంటావా లేకుంటే నువ్వే హైదరాబాద్ వస్తావా, అమరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. కేంద్రం, రాష్టాల్లో ఉన్న పార్టీలు ఒక్కటే అన్న వారిని చెప్పుతో కొట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారాస, కాంగ్రెస్ మోసపూరిత హామీలతో డ్రామాలు చేస్తున్నాయని, రైతుబంధు విషయంలో నాటకం ఆడుతున్నాయని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు రైతుబంధు గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు.

దేశంలో కుటుంబ పార్టీలను బిజెపి ఎప్పటికీ వదిలిపెట్టదని, కాంగ్రెస్‌పై తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. బిజెపి అధికారలోకి రాగానే హైదరాబాద్ పేరు కచ్చితంగా మారుస్తామని హామీ ఇచ్చారు. అసలు హైదర్ ఎవడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? పేరు ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు. ఇప్పటికే దేశంలో అనేక పేర్లు మార్చబడ్డాయని గుర్తుచేశారు. తెలంగాణలో మొదటిసారి ప్రధాని రోడ్ షో జరగనుందని, ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు రోడ్ షో జరగనుందని తెలిపారు. లక్ష మంది రాహుల్‌లు వచ్చినా, కోట్ల మంది ఓవైసీలు వచ్చినా, 2024లో మళ్ళీ పిఎం మోడీయే !, దీన్ని ఆపడం ఎవరి తరం కాదని ధీమా వ్యక్తంచేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News