హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు అయోమయంలో పడ్డాయి. ఇప్పటికే అధికార బిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించడంలో సతమతమవుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ అభ్యర్థుల జాబితాపై శనివారం మరోసారి కసరత్తు చేయనుంది. సాయంత్రం కేసీ వేణుగోపాల్ తో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు బేటీ కానున్నారు.
వామపక్షాలకు చెరో 2 సీట్లపై ఇప్పటికే అవగాహన కుదిరినట్లు సమాచారం. సిపిఎంకు ఇచ్చే సీట్ల వ్యవహారం ఇంకా పూర్తి కాలేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ రోజు దాదాపు 60 సీట్లపై చర్చ జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. వివాదం లేని సీట్లపై కాంగ్రెస్ నాయకులు చర్చించనున్నారు. ఎన్నికల కమిటీ ఆమోదం తర్వాత రెండో జాబితా విడుదల ఉంటుందని నేతలు చెబుతున్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరేవారికి తుది జాబితాలో చోటు కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.